BRS MLA : మర్రి రాజశేఖర్ రెడ్డికి షాక్.. MLRIT, ఏరోనాటికల్ కాలేజీలకు నోటీసులు

ManaEnadu:హైదరాబాద్ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మించిన వారిపై హైడ్రా (HYDRA Demolitions) ఉక్కుపాదం మోపుతోంది. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు అనే తేడా లేకుండా అందరికి సంబంధించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ప్రముఖుల కట్టడాలు కూల్చివేసి ప్రజలతో జేజేలు కొట్టించుకుంటోంది. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి (MLA Mallareddy) అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది.

కాలేజీలకు నోటీసులు

మేడ్చల్ జిల్లా దుండిగల్​లోని మర్రి రాజశేఖర్ రెడ్డి (BRS MLA Marri Rajasekhar Reddy)కి చెందిన మర్రి మల్లారెడ్డి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (MLRIT College), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నోటీసులకు వివరణ ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ (Anurag University), గాయంత్రీ సంస్థలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే.

విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం

ఇక హైడ్రా గురించి కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) మాట్లాడుతూ.. రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదలుచుకోలేదని తెలిపారు. ఒవైసీ, మల్లారెడ్డికి చెందిన నిర్మాణాల కూల్చివేత గురించి మాట్లాడుతూ.. ఇక్కడ రాజకీయ నాయకులను చూడమని.. విద్యార్థుల భవిష్యత్‌ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వాళ్ల పొరపాటు అయి ఉండొచ్చని.. ఎఫ్‌టీఎల్‌ అనేది ముఖ్యమైన అంశమేనని.. కానీ దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని వెల్లడించారు. ఒవైసీ, మల్లారెడ్డి లాంటి వ్యక్తుల కళాశాలలకు సమయం ఇస్తామని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.

 

Share post:

లేటెస్ట్