Mana Enadu: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైయిన BRS MLC, మాజీ సీఎం KCR కుమార్తె కవిత తిహార్ జైలు నుంచి మంగళవారం రాత్రి 9:12 గంటలకు విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి రావడంతో ఆమె అక్కడే ఉన్న తన కొడుకును ఆలింగనం చేసుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత భర్త అనిల్, అన్న కేటీఆర్(KTR)ను గుండెలకు హత్తుకుని ఆనందభాష్పాలు రాల్చారు. ఈ సమయంలో హరీశ్‌రావు(Harishrao) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు ఐదున్నర నెలల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.
కన్నీరు పెట్టుకున్న కవిత
ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. ‘జై తెలంగాణ(Jai Telangana).. నేను తెలంగాణ బిడ్డను. కేసీఆర్ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు పిల్లల్ని వదిలి ఉండటం అంత సులువైన విషయం కాదు. నేను ఎంత మంచిదాన్నో అంతే మొండిదాన్ని. చేయని నేరానికి జైలులో వేసి జగమొండిని చేశారు. 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. సమయం వస్తుంది. ఈ కష్ట సమయంలో తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు’ అని కవిత తెలిపారు.
సెక్షన్ 45 ప్రకారం ఆమె బెయిల్ పొందేందుకు అర్హురాలు: కోర్టు
కాగా లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ(ED), సీబీఐ(CBI) నమోదు చేసిన రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు(Suprem Court) కవితకు బెయిల్(Bail) మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆమె బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించారు. బుధవారం ట్రయల్ కోర్టులో విచారణకు హాజరైన అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మరోవైపు రేపు ఉదయం బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. కాగా కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని.. ఛార్జ్ షీట్(Chargsheet) కూడా దాఖలైందని ఈ దశలో కవితను జుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయడింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది.