ManaEnadu:తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక అప్డేట్ ఇచ్చింది. తాజాగా గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రిపరేషన్ కొనసాగించాలని సూచించింది.
మొత్తం 783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. డీఎస్సీ, గ్రూప్ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టులను పెంచాలని అప్పట్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. డీఎస్సీకి, గ్రూప్-2కు మధ్య వ్యవధి కూడా చాలా తక్కువగా ఉందని, నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై అభ్యర్థులు, ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి తీసుకురాగా ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో సీఎం రేవంత్ సర్కార్ తెలిపింది.
ఈ నేపథ్యంలో పరీక్షలను డిసెంబరులో నిర్వహిస్తామని, తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో గ్రూప్-2 ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడింది. మొత్తం 783 పోస్టులతో 2022లో ఉద్యోగ ప్రకటన వెలువడింది. అప్పట్లో 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. ఆందోళనల నేపథ్యంలో వాయిదా పడి తాజాగా కొత్త షెడ్యూల్ వెలువడింది. దీంతో గ్రూప్-2 పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారోనని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజాగా టీజీపీఎస్సీ అధికారులు గ్రూప్-2 కొత్త షెడ్యూల్‌ను ప్రకటించారు.