Telangana : పంచాయతీ ఎన్నికలు.. ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్‌ విడుదల

ManaEnadu:తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నకల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. స్థానిక ఎన్నికల్లోనూ తన హవా కొనసాగించాలనుకుంటోంది. ఇందుకోసం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ప్రజల మద్దతు లభిస్తుందని భావిస్తోంది. 

ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఈ క్రమంలోనే ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ (బుధవారం) షెడ్యూల్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 6వ తేదీన వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. జాబితాపై సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 9, 10వ తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి.. సెప్టెంబర్‌ 21వ తేదీన వార్డుల వారీగా తుది జాబితా ప్రచురించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ మేరకు ఓటరు జాబితా తయారీపై ఈనెల 29వ తేదీన కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

ఏడాది జనవరి 31తో గ్రామపంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అయితే ఆరు నెలలు దాటితే  కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు రావాల్సిన గ్రాంట్స్ ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆగమేఘాల మీద పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. 

Share post:

లేటెస్ట్