Mana Enadu: తెలుగు రాష్ట్రాలను వరుణుడు ఇప్పట్లో వదిలేలా లేడు. ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు, వరదల(RAINS & FLOODS) నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ(IMD) మరో పిడుగులాండి న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్(AP)లో కృష్ణానది నది ఉగ్రరూపం దాల్చడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు విజయవాడ(VJA) నగరం ఇప్పటికీ వరద బురదలోనే చిక్కుకుంది. తిండికి లేక.. అటు కట్టుకోవడానికి బట్టలు లేక జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కడి ప్రజలు కంటినిండా కునుకు తీద్దామన్న తీయలేని పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో మరోసారి వాతావరణ శాఖ వర్షకబురు చెప్పడం మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందాన తయారైంది ఏపీ వాసుల దుస్థితి. మరోసారి భారీ వర్షాలు వస్తే జనజీవనం అస్తవ్యస్తం, నరనయాతన అయ్యే ప్రమాదముందని జనం ఆందోళన చెందుతున్నారు.
వాతావరణ శాఖ ఏం చెబుతోందంటే.. ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అల్పపీడనం తోడైతే.. మరోసారి భారీ వర్షాలు(Heavy Rains) తప్పవని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంటున్నారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటు తెలంగాణ (Telangana)లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD)హెచ్చరిస్తోంది. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(Orange Alert)తో పాటు.. మరో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది.
అల్పపీడన ప్రభావంతో రేపు శ్రీకాకుళం(SKLM), విజయనగరం(VZM), పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం(VSP), అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, (NTR) జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అలాగే కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు(KNL), నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, (YSR), అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అయితే ప్రస్తుతం కృష్ణానది ప్రవాహం క్రమంగా తగ్గుతోందని, విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం 3.08 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా తెలంగాణలో గోదావరి నది వరద ప్రవాహం పెరుగుతుందని, భద్రాచలం వద్ద 44.4 అడుగుల నీటిమట్టం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఏ క్షణమైనా వర్షాలు పడే అవకాశం ఉన్నందునా అధికారులు, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.