అక్టోబర్​లో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఏ రోజున ఏయే సేవలు అంటే?

Mana Enadu:ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో భారతదేశంలోని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ సుప్రసిద్ధ ఆలయాన్ని సందర్శించుకునేందుకు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే వివిధ దేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఏడుకొండల మీద వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సాధారణ రోజుల కంటే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో రద్దీ విపరీతంగా ఉంటుంది. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వేంకటేశ్వర స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ప్రకటించింది. మరి ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు జరగనున్నాయి? ఏ రోజున ఎలాంటి సేవలు ఉండబోతున్నాయో తెలుసుకుందామా..?

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబరు 4వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆరోజున ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు 12వ తేదీన చక్రస్నానంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది.

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2024..

అక్టోబరు 4న ధ్వజారోహణం

అక్టోబరు 8న గరుడ సేవ

అక్టోబరు 9న స్వర్ణరథం

అక్టోబరు 11న రథోత్సవం

అక్టోబరు 12న చక్రస్నానం

బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు మళ్లీ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో అక్టోబరు 7వ తేదీన రాత్రి 11 గంటల నుంచి అక్టోబరు 8 అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం అమలు చేయనున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్​లో జరగనున్నందున ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ క్రమంలో అత్యద్భుతంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని టీటీడీ భావిస్తోంది. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్‌ఆర్‌ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది.

ఇంజినీరింగ్‌ పనులు, వాహనాల ఫిట్‌నెస్‌, లడ్డూల బఫర్‌ స్టాక్‌, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళా బృందాల కార్యక్రమాలు, ఉద్యానశాఖ, ట్రాన్స్‌పోర్ట్‌, కల్యాణ కట్ట, గోశాల, శ్రీవారి సేవకులు, విజిలెన్స్‌ విభాగం భద్రతా ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. మరోవైపు తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు చేరువచేసే లక్ష్యంతో టీటీడీ సర్వదర్శన టోకెన్ల సంఖ్య భారీగా పెంచుతోంది. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు సర్వదర్శన టికెట్లను భారీగా పెంచుతోంది.

 

 

Share post:

లేటెస్ట్