ManaEnadu:దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు (Road Accidents జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో వేల మంది మరణిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్స్, ఇలా అన్ని వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇంట్లో నుంచి బయట అడుగుపెడితే తిరిగి ఇంటికి సురక్షితంగా ప్రాణాలతో తిరిగి వెళ్తామన్న గ్యారంటీ లేకుండా పోయింది ఈరోజుల్లో. మనం సరిగ్గా వెళ్తున్నా.. ఎదుటివాళ్లు చేస్తున్న తప్పులకు కొందరు బలైపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ఇటీవలే ఓ సర్వేలో తేలింది.
హెల్మెట్ లేకపోవడం వల్లే మరణాలు..
తాజాగా రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ(Nitin Gadkari) మాట్లాడారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మరణిస్తున్నారని ఆయన అన్నారు. అందువల్ల ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ (Helmet) ధరించి ప్రయాణం చేయాలని ఆయన సూచించారు. ఇందుకు బైక్ హైల్మెట్ తయారీదారులు సహకరించాలని కోరారు. వాహన కొనుగోలుదారులకు తగ్గింపు ధర లేదా సహేతుకమైన ధరలకు హెల్మెట్లను అందించాలని నితిన్ గడ్కరీ విజ్ఞప్తి చేశారు.
బుధవారం (సెప్టెంబరు 4వతేదీ 2024) దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 50,029 మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అందువల్ల, ద్విచక్ర వాహన తయారీదారులకు హెల్మెట్‌లపై కొంత డిస్కౌంట్ (Helmets Discount ఇవ్వగలిగితే ప్రజల ప్రాణాల్ని కాపాడగలం అనిపించింది అని తన అభిప్రాయాన్ని తెలిపారు.
ప్రతి తాలుకాలో డ్రైవింగ్ స్కూల్
మరోవైపు పాఠశాల బస్సులకు కూడా పార్కింగ్ ఏర్పాటుకు సంబంధించి ఒక ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019 ట్రాఫిక్ నేరాలపై భారీగా ఫైన్‌లను అమలు చేసిందని వెల్లడించారు. దేశంలోని ప్రతి తాలుకాలో డ్రైవింగ్ స్కూల్ (Driving School) ప్రారంభించాలన్నది తన ఆశయమని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ చెప్పారు.