భారత్ లో కొత్తగా 12 స్మార్ట్ సిటీలు.. 30 లక్షల ఉద్యోగాలు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే 

ManaEnadu:భారత్ లో తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు కొత్తగా 12 స్మార్ట్ పారిశ్రామ నగరాలను (Smart Industrial Cities) ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దిల్లీలో  ఇవాళ (ఆగస్టు 28వ తేదీ) కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో ఉత్పత్తి రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీ (Union Cabinet Meeting)లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉత్పత్తి రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు.

భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి.  తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేలా దేశంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 12 స్మార్ట్‌ పారిశ్రామిక నగరాల ద్వారా 10లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రూ.28,602 కోట్ల పెట్టుబడితో 10 రాష్ట్రాల్లో 12 కొత్త పారిశ్రామిక కారిడార్లు (Industrial Corridors) ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

తెలంగాణలోని జహీరాబాద్‌ (Zahirabad Industrial Corridor), ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లు-కొప్పర్తి,  ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా,  పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌-పాలి, యూపీలోని ఆగ్రా-ప్రయాగ్‌రాజ్‌, బిహార్‌లోని గయ, మహారాష్ట్రలోని దిఘి, కేరళలోని పాలక్కడ్‌లో ఈ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి (Ashiwni Vaishnav) వెల్లడించారు ఈ ప్రణాళికలతో 10లక్షల మందికి నేరుగా ఉద్యోగాలు.. మరో 30లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. దాదాపు రూ.1.52 లక్షల కోట్ల పెట్టుబడులను ఇవి ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.

మరోవైపు కడప జిల్లా కొప్పర్తి (Kopparthy)లో పారిశ్రామిక హబ్‌ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. రూ.2,137కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ హబ్‌తో 54వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు (Orvakal)లో 2,621 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక కారిడార్‌తో 45వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు. రూ.2,786కోట్లతో నిర్మించనున్న ఈ కారిడార్ తో రాయలసీమకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

Share post:

లేటెస్ట్