అధిక లాభాలు ఇస్తామంటూ పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించారు. లక్ష పెట్టుబడికి పది నెలల్లో రూ.1.40లక్షల ఇస్తామంటూ ప్రచారం ఊదరగొట్టారు
ఉప్పల్‌లో జేవీ బిల్డర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కర్నూల్‌కు చెందిన లక్ష్మీనారాయణ, జ్యోతిలు ఆఫీస్ ప్రారంభించారు. రెండేళ్లుగా పెట్టబడులు పెట్టినవారికి ప్రతినెలా సక్రమంగా బ్యాంకుఖాతాల్లో చెల్లింపులు చేశారు. ఆపై కొత్తవారితో పెట్టుబడులు పెట్టిస్తే మరో 4శాతం అదనంగా కమిషన్ ఇస్తామంటూ ఆశ కల్పించారు.
అప్పటికే ఒక్కొక్కరూ అప్పులు తీసుకొచ్చి రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు 300మందికి పైగా పెట్టుబడులు పెట్టారు. కమిషన్ల కోసం మరో 7వేల మంది చేత పెట్టుబడులు పెట్టించారు.
గత నెల పిభ్రవరి నుంచి చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో బాధితులు ఒక్కొక్కరిగా ఆఫీస్‌కు చేరుకున్నారు.అప్పటికే జేవీ బిల్డర్స్ దుకాణం ఎత్తేశారు. ఇలా పెట్టుబడులు పెట్టినవారిలో ప్రభుత్వ ఉద్యోగులే పెద్ద సంఖ్యలోఉన్నారని సమాచారం. సోమవారం రాత్రి వంద మందికి పైగా బాధితులు ఉప్పల్ పోలీసులకు పిర్యాదు చేశారు. రాజు అనే రూ.18లక్షలు పెట్టుబడి పెట్టడంతోపాటు బంధువులు, స్నేహితులతో రూ.2.50కోట్ల పెట్టుబడులు పెట్టించి మోసపోయానని పిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.