Independence Day 2024: ఆ మహనీయులకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది: ప్రధాని మోదీ

ManaEnadu: దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఊరూవాడ 78వ స్వాతంత్ర్య దినోత్సవాలను ప్రజలు ఎంతో వేడుకగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మక ఎర్రకోటపై నుంచి వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ మొదట రాజ్‌‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. కాగా 11 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన రెండో ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ ఘనతను పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దేశ మొదటి ప్రధానమంత్రిగా వరుసగా 11 సార్లు జెండా ఎగురవేసి, జాతినుద్దేశించి ప్రసంగాలు చేశారు.

వికసిత్ భారత్ థీమ్‌తో

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ సమయంలో భారత ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2047 వికసిత్ భారత్ థీమ్‌తో ఈసారి పంద్రాగస్టు వేడుకలు జరుగుతున్నాయి. ఈసారి వేడుకలకు సుమారు 6 వేల మంది అతిథులు హాజరయ్యారు. ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ బలగాలు సహా 10 వేల మందికిపైగా సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏఐ కెమెరాలు, అధునాత సీసీటీవీలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

 మహనీయులను స్మరించుకుందాం: మోదీ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని PM మోదీ పిలుపునిచ్చారు. ‘దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నేడు హర్‌ఘర్‌ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ప్రాణాలర్పించిన సమరయోధులకు దేశం రుణపడి ఉంది. భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. స్వాతంత్ర్యం కోసం 40కోట్ల మంది పోరాడారు. ఇప్పుడు మన జనాభా 140కోట్లు. మనం వారి కలలను సాకారం చేయాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి’ అని ప్రధాని సూచించారు.

 

 

Share post:

లేటెస్ట్