ManaEnadu:పశ్చిమ బెంగాల్ (West Bengal) కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన (Kolkata Doctor Rape Murder) దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ మేరకు అసెంబ్లీలో ఇవాళ (సెప్టెంబరు 3, 2024) బెంగాల్ ప్రభుత్వం హత్యాచార నిరోధక బిల్లును ప్రవేశపెట్టింది.
‘అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు (Aparajita Women and Child Bill)’ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై చర్చ, ఆమోదం కోసం ప్రత్యేక సెషన్‌ను నిర్వహిస్తోంది. చర్చ అనంతరం ఈ బిల్లుకు బంగాల్ రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banarjee) అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. మరోవైపు హత్యాచార ఘటనపై మమత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తోన్న విపక్షాలు ఈ బిల్లుకు మద్దతు ప్రకటించడం గమనార్హం.
ఇక ముఖ్యమంత్రి మమత మాట్లాడుతూ, డాక్టర్ హత్యాచారం కేసులో దోషులకు మరణశిక్ష విధించాలని, సీబీఐ నుంచి న్యాయం కోరుతున్నామని మమతా బెనర్జీ అన్నారు. ఈ రోజు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై గవర్నర్ (Bengal Governor) సంతకం చేయాలని విపక్షాలు అడగాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత దానిని అమలు చేసే బాధ్యత తమదని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా కేంద్రచట్టంలోని లోపాలను సరిద్దిద్దే ప్రయత్నం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. సత్వర విచారణ, బాధితులకు న్యాయం లభించడం ఈ బిల్లు లక్ష్యమని ఉద్ఘాటించారు.
“ఒకసారి ఈ బిల్లు పాస్ అయితే.. రాష్ట్రంలో ప్రత్యేక అపరాజిత టాస్క్ ఫోర్స్ (Aparajita Task Force)ను ఏర్పాటు చేస్తాం. అత్యాచారం వంటి దారుణాలు జరగకుండా సామాజిక సంస్కరణలు రావాలి. యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై అసాధారణ స్థాయిలో నేరాలు జరుగుతున్నా ఎవరూ మాట్లాడటం లేదు. కానీ బెంగాల్‌లో మహిళలకు కోర్టుల్లో న్యాయం లభిస్తుంది. మహిళ రక్షణ కోసం సమర్థవంతమైన చట్టాలు తీసుకురాలేని ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేయండి’’ అని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.