క్షణక్షణం భయంభయం.. మనుషుల రక్తం మరిగిన తోడేలు.. అదను చూసి దాడులు

ManaEnadu:ఉత్తర్ ప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాలో ఇటీవల తోడేళ్ల దాడులు(Wolf Attacks) పెచ్చుమీరి పోయాయి. వీటిని పట్టుకునేందుకు యూపీ సర్కార్ ‘ఆపరేషన్‌ భేడియా’ (Operation Bhediya) చేపట్టినా ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం రాత్రి ఓ చిన్నారిపై తోడేలు దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. అయితే తోడేలు దాడులపైన జంతు నిపుణులు ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం అటవీ అధికారులు చెబుతున్నట్లుగా తోడేళ్లు గుంపు (Wolf Pack)గా దాడి చేయడం లేదని.. కేవలం ఒక్క తోడేలు మాత్రమే దాడులకు తెగబడుతోందని అనుమానిస్తున్నారు. అయితే దీనికీ ఓ కారణం ఉందట. అదేంటంటే?

మనుషుల రక్తానికి రుచి మరిగిన తోడేలు మాత్రమే ఈ దాడులకు పాల్పడుతోందని వూల్ఫ్‌ బయలాజిస్ట్‌ విక్రామ్‌సిన్హ్‌ జాహ్లా (Wolf biologist Vikram sinh Jhala) చెబుతున్నారు. ఇటీవల తోడేళ్ల దాడిలో గాయపడిన బాధితులను గమనిస్తే కేవలం ఒక తోడేలు మాత్రమే దాడి చేసిందని గమనించొచ్చని తెలిపారు. ఒకవేళ గుంపుగా దాడి చేసుంటే మనుషుల శరీరాలు ఛిద్రమైపోయేవి, మృతదేహాల ఆనవాళ్లు కూడా సరిగ్గా కనిపించకపోయేవని వెల్లడించారు.

కానీ దొరికిన మృతదేహాలకు కొన్ని గాయాలు మినహా పెద్దగా దెబ్బతినలేదని.. గుంపు దాడి చేసుకుంటే మృతదేహాల తలలను, ఇతర భాగాలను వేరే చోటుకు తీసుకెళ్లి పడేసి ఉండేదని ఆయన వెల్లడించారు. కానీ తాజాగా దొరికిన మృతదేహాల్లో కేవలం కొంత మాంసం మాత్రమేతినేసి వదిలేసినట్లు గుర్తించినట్లు వివరించారు. ఇది ఒంటరి తోడేలు (Lone Wolf) లక్షణమని ఆయన తేల్చి చెప్పారు. ఒక తోడేలు ఒకసారి కేవలం 6 కిలోల మాంసం మాత్రమే తినగలదని.. గుంపు ఉంటే భారీ జంతువును ఈజీగా తినేస్తాయని పేర్కొన్నారు.

రక్తం రుచిమరిగేది ఇలా..

సాధారణంగా మాంసాహార జంతువైన తోడేలు మనుషులపై దాడి చేయదు. వాటికి సంబంధించిన ప్రదేశాల్లో మాత్రమే తిరుగుతుంటాయి. ఒక్కసారి కడుపు నిండా తినేసి చాలా కాలం వేటకు వెళ్లకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు తోడేళ్లు నివసించే ప్రాంతాలకు సమీపం వరకూ జనం భవనాలు నిర్మిస్తుండటంతో అవి జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అని ది ఇంటర్నేషనల్‌ వూల్ఫ్‌ సెంటర్‌ చెబుతోందని విక్రామ్ సిన్హ్ తెలిపారు. మరోవైపు యూపీలో తోడేళ్లు, కుక్కలను క్రాస్ బ్రీడ్ (Wolfs Dogs Cross Breed) చేసిన శునకాలను పెంచుకుంటారు. దీంతో హైబ్రిడ్ తోడేళ్లకు మనుషులంటే భయం పోయింది. ఇక తోడేళ్లు తినే కుందేళ్ల వంటి జంతువుల సంఖ్య తగ్గిపోవడంతో బహరాయిచ్‌లో చిన్నారులపై దాడులకు తెగబడుతున్నాయి. అటవీ శాఖ అధికారులు ఈ ఒంటరి తోడేలును బంధించాలని విక్రామ్ సిన్హ్ కోరారు.

Share post:

లేటెస్ట్