
గ్రూపు-1,2,3 ఫలితాల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రకటించింది. తెలంగాణలో గ్రూప్స్ ఫలితాల వెల్లడికి రూపొందించిన షెడ్యూల్‌ను తాజాగా వెల్లడించింది. ఈ నెల 10 నుంచి 18 మధ్య గ్రూప్-1, 2, 3 ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. మార్చి 10న గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
మార్చి 10న గ్రూప్-1 ఫలితాల విడుదల, అదే రోజు అభ్యర్థుల ప్రొవిజినల్ మార్కుల వివరాలను వెల్లడించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఆ తర్వాత అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని వెల్లడించింది. మార్చి 11న గ్రూప్-2.. 14వ తేదీన గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 17వ తేదీన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, 19వ తేదీన ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు వెల్లడించనున్నట్లు పేర్కొంది.
మరోవైపు గ్రూప్ -1 (Group 1) నియామకాలకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. కమిషన్ సిబ్బందితో కానీ, అధికారులతో కానీ పరిచయాలున్నాయని ఎవరైనా మధ్యవర్తులు ఉద్యోగాలిస్తామంటూ చెబితే వారిని నమ్మవద్దని టీజీపీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. అలా ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్ లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని సూచించింది. ఆ సమాచారాన్ని పోలీసు ఫిర్యాదు పత్రంతో కలిపి కమిషన్ కు అందజేయాలని తెలిపింది.
9966700339 నంబర్ కు కాల్ చేసి లేదా, వాట్సాప్ ద్వారా, ఈ-మెయిల్ ఐడీ : vigilance@tspsc.gov.in ద్వారా ఫిర్యాదు గురించి సంప్రదించవచ్చని వెల్లడించింది. తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్ పారదర్శకమైన నియామక విధానాలు అనుసరిస్తుందనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కమిషన్ పేర్కొంది. తప్పుదారి పట్టించే వ్యక్తుల గురించి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించింది.