
అన్నమయ్య జిల్లాలో ఏనుగులు సృష్టించిన బీభత్సానికి ముగ్గురు భక్తులు ప్రాణాలు విడిచారు. మహాశివరాత్రి పర్వదినాన్ని (Maha Shivaratri) పురస్కరించుకుని కొందరు భక్తులు శివయ్య ఆలయానికి వెళ్తుండగా ఏనుగుల గుంపు వారిపై దాడికి తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే..?
ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగులు భక్తులపై దాడి (Elephant Attack) చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేశాయని అధికారులు వెల్లడించారు.
సమగ్ర నివేదిక ఇవ్వాలి
ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ అసెంబ్లీ నుంచి హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలని ఆదేశించారు. ఈ గటనపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీశాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.