Mana Enadu : కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Tirumala Srivari Brahmotsavam) ఇవాళ్టి (అక్టోబర్ 4వ తేదీ 2024) నుంచి కన్నుల పండువగా జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం 5.45 గంటలకు మీన లగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజారోహణం నిర్వహిస్తారు. దీంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఇక రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవతో ఈ ఉత్సవాల్లో వాహన సేవలు ప్రారంభం అవుతాయి.
శ్రీవారికి సీఎం పట్టువస్త్రాలు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. స్వామివారి సేనాధిపతులైన విష్వక్సేనుల వారు శ్రీవారి సన్నిధి నుంచి విమాన ప్రదక్షణగా రంగనాయకుల మండపానికి వేంచేయగా.. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాద్యాల మధ్య అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నేడే పెద్దశేష వాహన సేవ
తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఈరోజు మీన లగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజ పటం ఎగురవేయడంతో మలయప్ప స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవాళ రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవతో మొదలయ్యే శ్రీవారి వాహన సేవలు (Srivari Vaahana Sevalu).. అక్టోబర్ 11వ తేదీన ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రికి అశ్వ వాహనంతో ముగుస్తాయి. 12వ తేదీన శ్రీవారి పుష్కరిణిలో చక్రత్తాళ్వారుకు జరిగే స్నపన తిరుమంజనంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు ముగింపు పలుకుతారు.
పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ (Tirumala VIP Break Darshan) సహా అన్నీ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. మరోవైపు ఈ ఉత్సవాలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్యాలరీల్లో తోపులాటలు జరగకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు రానుండటంతో భద్రతను మరింత పటిష్ఠం చేశారు.