Mana Enadu: తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం లక్షల మంది భక్తులు వస్తుంటారు. కలియుగ వైకుంఠాన్ని సందర్శించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి కుటుంబ సమేతంగా వస్తారు. తిరుమల శ్రీవారి (Tirumala Srivaru)ని దర్శించుకుని ధన్యజీవులవుతారు. కొంతమంది అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన నడిచి భక్తిపారవశ్యంలో మునిగిలేలుతూ వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు.
శ్రీవారి ఆర్జిత దర్శన టికెట్లు
అయితే శ్రీవారిని దర్శించుకోవాలంటే ముందుగానే టికెట్లు (Tickets) బుక్ చేసుకోవాలి. రద్దీ దృష్ట్యా ప్రీ బుకింగ్ ఉంటేనే ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ క్రమంలోనే ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ (సెప్టెంబరు 18వ తేదీన) డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత దర్శనాల ఆన్‌లైన్ కోటాను విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటల వరకు నమోదుకు అవకాశం కల్పించింది.
23న శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా
ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. వర్చువల్ సేవా (Virtual Seva Tickets) టికెట్లను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని తెలిపింది. ఇక 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తామని పేర్కొంది.
వెబ్సైట్లో టికెట్లు బుకింగ్
మరోవైపు సెప్టెంబరు 24న ఉదయం 10 గంటలకు డిసెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Darshan) రూ.300 టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. 27వ తేదీన ఉదయం 11 గంటలకు డిసెంబరు నెలకు సంబంధించి తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవా కోటా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు.