ఐపీఎల్ మెగా వేలంలో యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) అమ్ముడుపోలేదు. అతడిని కొనేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకురాలేదు. గతేడాది వరకు ఢిల్లీకి ఆడిన ప్రృథ్వీ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడి బేస్ ప్రైజ్ రూ.75 లక్షలకు కూడా కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే పృథ్వీ షాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ (trolling) జరుగుతోంది. ప్రాక్టీస్ చేయకుండా పార్టీలు చేసుకుంటాడని, పబ్బుల్లో గడుపుతాడని అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు స్పందించాడు. తన కెరీర్ ఆసాంతం ట్రోలింగ్ జరుగుతూనే ఉందని.. బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవద్దా అని ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా (Viral Video) మారింది.
‘నన్ను ట్రోల్ చేస్తున్నారు అలాగే ఫాలో కూడా చేస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి నన్ను ఫాలో కాకపోతే ట్రోల్ ఎలా చేస్తారు? దానర్థం అతడి కళ్లన్నీ నామీదే ఉన్నాయని అర్థం. ట్రోలింగ్ అనేది మంచిది కాదు.. అలాగని చెడ్డది కూడా కాదు. కేవలం క్రికెటర్లే కాకుండా ఇతర రంగాల వ్యక్తులను కూడా ట్రోలింగ్ చేయండం చూస్తున్నాం. నేను అన్ని రకాల ట్రోలింగ్‌ను గమనిస్తూనే ఉంటా. నాపై చేసే మీమ్స్‌ను చూస్తూనే ఉంటా. కొన్ని సార్లు బాధపెడుతూ ఉంటాయి. నన్ను బయటచూసిన కొందరు వ్యక్తులు నేను ప్రాక్టీస్ చేయడంలేదని అంటుంటారు. నా బర్త్‌డే రోజు కూడా నేను బయటకు వెళ్లకూడదని భావిస్తుంటారు. నేనేం తప్పు చేశానో కూడా అర్థం కాని పరిస్థితి. ఏం చేసినా తప్పుపట్టే వాళ్లు ఉంటారని అర్థం చేసుకున్నా. తప్పు లేదని తెలిస్తే.. దాన్ని అందరికీ కనిపించేలా చేయాలి’’అని ఆ వీడియోలో అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#PrithviShaw Sad Man To See uR Downfall Really Sad Man 😢😔 #PrithviShaw #ipl2025auction @mipaltan @RCBTweets pic.twitter.com/tuHczWEEgG
— CHANDU (@GREATCHANDU1) November 25, 2024
ఐపీఎల్ వేలంలో ఈ యువ బ్యాటర్ అమ్ముడుపోకపోవడంపై కొందరు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘కనీస ధర రూ.75 లక్షలతో ఉన్న పృథ్వీ షాను తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితులు ఆ యువ క్రికెటర్‌కు ఇబ్బందికరమే. అయినా ఇక్కడ ఫామ్ కీలక పాత్ర పోషించింది. పవర్ ప్లేలో దూకుడుగా ఆడతాడు. ఒకే ఓవర్లో 6 ఫోర్లు కొట్టాడు. అతడి శక్తిపై మాకు నమ్మకముంది. మళ్లీ అతడు దేశవాలీ క్రికెట్లో సత్తా చాటి ఫిట్నెస్, ఫామ్ అందుకుంటే సర్ఫరాజ్ ఖాన్‌లా అందుకునే అవకాశం ఉంది’ అని కైఫ్ అన్నాడు.