TS GOVT: ఇకపై వారికి 48 గంటల్లోనే డబ్బు జమ.. జనవరి నుంచి సన్నబియ్యం!

Mana Enadu: తెలంగాణలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ హామీని సీఎం రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఈ స్కీమ్‌లో ముందుగా గ్యాస్ సిలిండర్‌కు పూర్తి నగదు చెల్లిస్తే ప్రభుత్వం సబ్సిడీ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తుంది. అయితే ఆ సబ్బీడీ మొత్తం ఎప్పుడు వారి ఖాతాల్లో పడుతున్నాయన్నది ఎవరికీ క్లారిటీ లేకపోవటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చాలా మందికి నెలలు గడిచినా సబ్సీడీ సొమ్ము అకౌంట్లలో పడటం లేదు. మరోవైపు కొందరికి అస్సలు సబ్బిడీ మనీ రాకపోవటంతో తాము అర్హులం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 పది రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశం

ఇటీవల సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రూ.500కు గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ అంశంపై ఆయిల్‌ కంపెనీల ఉన్నతాధికారులతో మంత్రులు చర్చించారు. వినియోగదారులకు సిలిండర్‌ డెలివరీ అయిన 48 గంటల వ్యవధిలోనే వారి బ్యాంకు ఖాతాలోకి సబ్సిడీ పైసలు జమ కావటంతో పాటు మొబైల్‌కు మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు దీనిపై పౌరసరఫరాల శాఖకు సంబంధించి వివిధ అంశాలపై 10 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు తేల్చి చెప్పారు.

జనవరి నుంచే సన్నబియ్యం

ఇదిలా ఉంటే రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీని అమలుచేస్తామని ఆయన వెల్లడించారు. సన్నబియ్యం పంపిణీతో పాటు గోధుమలు కూడా ఇవ్వాలని సర్కారు యోచిస్తున్నట్టు తెలిపారు. అయితే గోధుమలను పూర్తిగా ఉచితంగా కాకుండా సబ్సిడీ ధర కింద అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్న అంశంపై కూడా మంత్రులు చర్చించారు. రేషన్‌ దుకాణాల్లో అక్రమాలు జరిగినా, పీడీఎస్‌ బియ్యం పక్కదారి పట్టించినా ఊరుకునేది లేదని, అవసరమైతే డీలర్‌షిప్‌ రద్దుచేయడానికీ వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు.

Share post:

లేటెస్ట్