Mana Enadu : బాక్సాఫీస్ వద్ద జోరు చూడాలంటే పండుగలు రావాల్సిందే. సంక్రాంతి, దసరా, దీపావళి (Diwali) పండుగలకు బాక్సాఫీస్ కు సరికొత్త శోభను తీసుకొస్తాయి. ఓవైపు పండుగ జోష్ లో అంతా సంబురాలు చేసుకుంటుంటే.. మరోవైపు సినీ ప్రేక్షకులు మాత్రం తమ కుటుంబాలతో కలిసి థియేటర్లకు క్యూ కడుతుంటారు. ఇక పండుగకు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఉండే ఊపే వేరు. కథ, కమర్షియల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్.. ఇలా అన్నీ సమపాళ్లలో కుదిరితే పండుగ ఏదైనా.. హీరో ఎవరైనా.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించడం ఖాయం.
అలా బాక్సాఫీస్ (Tollywood Box Office) వద్ద దుమ్మురేపేందుకు త్వరలోనే దీపావళి పండుగ సందర్భంగా అదిరిపోయే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలా దసరా పండుగకు వేట్టాయన్, విశ్వం, మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనక లాంటి సినిమాలు రిలీజ్ అయి మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి. కానీ ఈసారి దీపావళి పండుగకు సినిమా హాళ్లలో లక్ష్మీబాంబ్ లా పేలిపోయేందుకు.. కాసుల వర్షం కురిపించేందుకు పలు చిత్రాలు రెడీగా ఉన్నాయి. నాలుగు సినిమాలు దీపావళి రేసులోకి దిగాయి.
లక్కీ భాస్కర్ కు లక్ కలిసొచ్చేనా?
అందులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లక్కీ భాస్కర్(Lucky Bhaskar)’ మూవీ ఒకటి. ఇందులో మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా ఈ దీపావళికి రిలీజ్ కాబోతోంది.
దీపావళి రేసులో నిఖిల్
ఎలాంటి అప్డేట్ లేకుండా.. ముందస్తు సమాచారం లేకుండా ‘కార్తీకేయ’ ఫేం నిఖిల్ సడెన్ గా దీపావళి రేసులోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘స్వామి రా రా’, ‘కేశవ’ సినిమాల్లో కలిసి పనిచేసిన నిఖిల్ – డైరక్టర్ సుధీర్ వర్మ కాంబోలో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo)’ సినిమాతో ఈ పండుగకు నిఖిల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
సాయి పల్లవి అమరన్
ఇక లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా తమిళ్ డబ్బింగ్ మూవీ ‘అమరన్ (Amaran)’ కూడా దీపావళి బరిలో నిలిచింది. శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ పెరియసామి దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.
ప్రశాంత్ నీల్ బఘీరా
మరోవైపు కన్నడలో రోరింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీమురళి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బఘీరా(Prasanth Neel Bhageera) కూడా దీపావళికే రానుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేజీఎఫ్, కాంతార, సలార్ లాంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.
‘క’ తో దీపావళి బరిలో కిరణ్
కంటెంట్ ఉన్న స్టోరీతో కిరణ్ అబ్బవరం కూడా దీపావళి బరిలోకి దిగాడు. 1970ల నాటి కథతో ముస్తాబైన సినిమా ‘క'(Kiran Abbavaram Ka) తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు ఒకరు సుజిత్, మరొకరు సందీప్ ఉండటం గమనార్హం. హీరోయిన్‌గా తన్వీ రామ్ నటించారు.