హీరో ఇమేజ్ను పక్కనపెట్టి భిన్నమైన కథలతో అలరిస్తుంటాడు సుహాస్ (Suhaas). గ్లామర్ రోల్స్‌కే పరిమితం కాకుండా మంచి స్టోరీలు ఎంచుకుంటూ తన నటనతో పాత్రలకు ప్రాణంపోస్తుంది కీర్తి సురేశ్ (Keerthy Suresh). కాగా ఇద్దరు మెయిన్ క్యారెక్టర్లుగా నటించిన మూవీ ‘ఉప్పు కప్పురంబు’. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తోంది. (Uppu Kappurambu Movie Review) ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వైబ్‌లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథేంటంటే..
తండ్రి చనిపోవడంతో చిట్టి జయపురం ఊరి పెద్దగా బాధ్యతలు స్వీకరిస్తుంది అపూర్వ (కీర్తి సురేశ్). కానీ కొద్దిరోజులకే ఆ ఊరికి ఓ విచిత్ర పరిస్థితి ఎదురవుతుంది. గ్రామంలోని శ్మశానానికి భూమి కొరత వస్తుంది. కేవలం నలుగురిని మాత్రమే శ్మశానంలో సమాధి చేసేందుకు చోటు ఉంటుంది. దీంతో ఊళ్లో చిచ్చు మొదలవుతుంది. మరి ఈ సమస్యను కాటికాపరి అయిన చిన్న (సుహాస్)తో కలిసి పరిష్కరించాలని అపూర్వ భావిస్తుంది. ఊళ్లో చావుకు దగ్గరైన వాళ్ల వివరాలు సేకరించడం, శ్మశానంలో చోటుకోసం లాటరీ తీయడం వంటివి చేస్తుంటారు. మరి సమస్య పరిష్కారానికి వీరిద్దరు కలిసి ఏం చేశారు? ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరకు అపూర్వ తీసుకున్న నిర్ణయంతో సమస్య పరిష్కారమైందా? అనేది స్టోరీ.
ఎలా ఉందంటే..
రొటీన్ కథలకు భిన్నంగా ప్రస్తుత దర్శకులు సరికొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు వస్తున్నారు. అసలు ఇలాంటి పాయింట్‌తో కూడా సినిమా తీయొచ్చా? అని ఆశ్చర్యపరిచేలా తెరకెక్కించిన మూవీనే ‘ఉప్పు కప్పురంబు’. గ్రామంలో శ్మశానానికి భూమి కొరత.. అనే పాయింట్‌తో ఈ సినిమాను వినోదాత్మకంగా రూపొందించారు దర్శకుడు ఐవీ శశి. చెప్పాలనుకున్న పాయింట్‌ను ఆడియన్స్‌కు చేరవేస్తూనే వారు విసిగిపోకుండా కామెడీ పండిస్తూ ఎంగేజ్ చేయగలగాలి. శ్మశానం కొరత అనేది చిన్న పాయింట్ కావడంతో అసలు విషయాన్ని ఆవిష్కరించే క్రమంలో మూవీలో పలు లోటుపాట్లు కనిపిస్తాయి. కథ మొత్తం అక్కడక్కడే తిరిగిన భావన కలుగుతుంది. తల్లి చివరి కోరిక నెరవేర్చడం కోసం చిన్న చేసే పనితో కథ కీలక మలుపు తిరుగుతుంది. అదికాస్త ఊళ్లో వివాదానికి దారితీయడం ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కాస్త ఆసక్తిని కలిగిస్తాయి. చివరి అరగంట సినిమాకు ప్రధాన బలం. అపూర్వగా కీర్తి సురేశ్ చాలా బాగా యాక్ట్ చేసింది. చిన్న పాత్రలో సుహాస్ అలవోకగా నటించాడు. ఊరి పెద్దలుగా బాబూమోహన్, శత్రు కామెడీని బాగానే పండించారు.
@ రేటింగ్ 2.5






