
కోలీవుడ్ హీరో విక్రమ్ (Vikram)కు ఈ మధ్య సినిమాలు అస్సలు కలిసి రావడం లేదు. ఇటీవల తంగలాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ ఇప్పుడు వీరధీరసూరన్ (veera dheera sooran) అంటూ ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యాడు. ఏ అరుణ కుమార్ తెరకెక్కించిన వీర ధీర సూరన్ – పార్ట్ 2 చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఇవాళ ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. కానీ అనుకోకుండా ఈ చిత్ర మార్నింగ్ షో రద్దయింది.
విక్రమ్ కు షాక్
ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న వీరధీర సూరన్-2 (veera dheera sooran 2) చిత్రం మార్చి 27న (ఇవాళ) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ సినిమా మార్నింగ్ షోస్ ను రద్దు చేశారు. ఈ చిత్రానకిి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదయింది. ఈ సినిమాకు సంబంధించి అన్ని హక్కులను తామే కలిగి ఉన్నామని, థియేటర్ రిలీజ్ కు సంబంధించి నిర్మాతలు తమతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించారని ఈ సినిమాకు ఫైనాన్షియర్ గా ఉన్న ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది.
మార్నింగ్ షో రద్దు
తమకు చెల్లించాల్సిన రూ. 7 కోట్ల బకాయిలు ఇచ్చిన తర్వాతే ఈ సినిమాను విడుదల చేయాలని కోర్టులో (Delhi High Court) పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విక్రమ్ సినిమా విడుదలకు చిక్కొచ్చి పడింది. ఈ క్రమంలోనే వీరధీర సూరన్-2 సినిమా మార్నింగ్ షోను ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సిల్ చేశారు. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి రీఫండ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ వ్యవహారం చక్కదిద్దుకోవడానికి నిర్మాతలకు ఢిల్లీ హైకోర్టు 48 గంటల గడువు ఇచ్చింది. మరి ఈ అడ్డంకులన్నీ తొలగించుకుని ఈ చిత్రం రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.