ManaEnadu:లెబనాన్, సిరియా(Syria)లపై మంగళవారం అనూహ్య దాడి జరిగిన విషయం తెలిసిందే. రెండు దేశాల్లో ఒకేసారి వందల పేజర్లు పేలిపోవడం (pager explosions)తో 12 మంది మృతి చెందగా.. 2,800 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్క సిరియాలోనే ఏడుగురు మృతి చెందారు. గాయపడిన వారిలో లెబనాన్‌లోని ఇరాన్ రాయబారితోపాటు హెజ్‌బొల్లా కీలక నేతలు ఉన్నారు. ఈ అనూహ్య దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిన్న పేజర్లు.. నేడు వాకీటాకీలు
అయితే వేలాది పేజర్లు పేలిపోయిన ఘటన నుంచి తేరుకోకముందే లెబనాన్ (Lebanon)లో మరోసారి దాడులు జరిగాయి. తాజాగా వాకీటాకీ (Walkie Talkies)లు పేలినట్లు తెలిసింది. పేజర్ల పేలుళ్ల ఘటనలో మృతి చెందిన కొందరి అంత్యక్రియలు జరుపుతున్న సమయంలో లెబనాన్ రాజధాని బీరూట్‌లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు పేలాయని, ఈ ఘటనల్లో 100 మందికి పైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని హెజ్‌బొల్లా (hezbollah) సైతం వెల్లడించింది. వాకీటాకీలు పేలిపోవడం వల్లే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇది ఇజ్రాయెల్ పనే
పేజర్ల పేలుళ్లు ఇజ్రాయెల్ (Israel) పనేనని హెజ్‌బొల్లా ఆరోపణలు చేసింది. తమ శత్రువే ఈ పేలుళ్ల వెనుక ఉన్నాడని.. పేలినవన్నీ కొత్తవే’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ఇది అతి పెద్ద భద్రతా వైఫల్యంగా అభిప్రాయపడిన హెజ్‌బొల్లా .. ఇజ్రాయెల్‌కు శిక్ష తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేస్తామని లెబనాన్ తెలిపింది.
అసలు పేజర్లు అంటే ఏంటి?
సెల్‌ఫోన్లు రాక ముందు సమాచారం అందజేయడానికి వాడే పరికరాలను పేజర్లు (Pagers) అనేవారు. సెల్‌ఫోన్ సైజులో ఉండే ఈ పరికరం ద్వారా ఎవరికైనా సందేశం చేరవేయొచ్చు. మనం ఎవరికి సమాచారం అందించాలో తెలియజేస్తూ పేజర్ల సెంటర్‌కు కాల్ చేసి చెబితే.. ఆ సెంటర్‌లో ఉండే ప్రతినిధి సంబంధిత వ్యక్తి వద్ద ఉండే పేజర్‌కు సందేశం పంపుతారు. దాన్ని చూసుకున్న వ్యక్తి అవసరమైన వారికి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి కాల్ చేసి మాట్లాడతారు.