IMD ఇచ్చే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లకు అర్థమేంటో తెలుసా?

Mana Enadu : ప్రస్తుతం దక్షిణాదిన ఏపీ, చెన్నై, బెంగళూర్లను వరణుడు వణికిస్తున్నాడు. భారీ వర్షాలతో ఈ మూడు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ముఖ్యంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (AP Rains Today) కురుస్తున్నాయి. చాలా వరకు ప్రాంతాలు నీట మునిగాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు పంట కోతకు వచ్చిన సమయంలో వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అయితే సాధారణంగా వాన కురిసినప్పుడు ఆ ప్రాంతంలో ఇన్ని మిల్లిమీటర్ల వర్షం పడింది. ఈ ప్రాంతంలో ఇన్ని సెంటిమీటర్ల వర్షం కురిసింది అంటూ వాతావరణ శాఖ లెక్కలు చెబుతూ ఉంటుంది. అసలు వర్షాన్ని ఎలా లెక్కిస్తున్నారు..? ఐఎండీ ఇచ్చే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ (Rain Alerts) లకు అర్థం ఏంటి..? ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.

వర్షాన్ని ఇలా కొలుస్తారు

ఏ ప్రాంతంలోనైనా అక్కడి సమతలంపై నీరు ఎంత ఎత్తుకు చేరుకుంటుందో ఆ మట్టం ఆధారంగా వర్షపాతాన్ని (Rainfall Measuring) లెక్కిస్తారని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. దీన్ని కొలవడానికి రెయిన్ గేజ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారని తెలిపారు. ఈ గేజ్‌లో పడిన వర్షపు నీరు నిల్వ చేసి.. ఆ నీటి స్థాయిని కొలిచి మిల్లీమీటర్లలో వర్షపాతం ఎంత అని లెక్కిస్తారని వెల్లడించారు.

ఎల్లో అలర్ట్ (Yellow Alert) :

ఒక ప్రాంతంలో 6.45 సెంటీ మీటర్ల నుంచి 11.55 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురిసే అవకాశాలున్నాయనే అంచనాల మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (Rain Yellow Alert) జారీ చేస్తుంది. ఈ అలర్ట్ జారీ చేశారంటే ప్రస్తుత వాతావరణం ప్రతి కూలంగా మారుతుందని..  30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి నెలకొంటుందని అర్థం. మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ఈ అలర్ట్ జారీ చేస్తారు.

ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) :

ఒక రోజు వ్యవధిలో 11.56 సెంటీమీటర్ల నుంచి 20.44 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురవొచ్చన్న అంచనాతో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ (IMD Orange Alert) జారీ చేస్తుంది. ఈ అలర్ట్ జారీ చేశారంటే.. గాలుల తీవ్రత 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం ఉంటుందని అర్థం. అంతే కాకుండా వరద ముప్పు పొంచి ఉందని అధికారులు అప్రమత్తం చేసినట్టు. ఈ అలర్ట్ జారీ అవ్వగానే అధికార యంత్రాంగం.. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందే.

రెడ్ అలర్ట్ (Red Alert) :

రెడ్ అలర్ట్.. ఎరుపు రంగు డేంజర్ కు సంకేతం. వాతావరణంలో కూడా రెడ్ డేంజర్ నే సూచిస్తుంది. వర్షపాతానికి సంబంధించి చివరి హెచ్చరికగా రెడ్ అలర్ట్ (Rain Red Alert) ను పరిగణిస్తారు. 24 గంటల వ్యవధిలో ఏదైనా ప్రాంతంలో 20.45 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే వీలుంటే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఈ అలర్ట్ ప్రభుత్వాలకు ఓ హెచ్చరిక లాంటింది.  అత్యంత ప్రతి కూల వాతావరణ పరిస్థితులను సూచించే ఈ అలర్ట్ జారీ అవ్వగానే యంత్రాంగం మరింత అప్రమత్తమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

ఈ అలర్ట్ జారీ చేశారంటే.. రోడ్లపైకి వరద(AP Floods) పోటెత్తడం, వాహనాల రాకపోకలకు అంతరాయం, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం వంటివి జరుగుతాయని అర్థం. ప్రజల ప్రాణాలకు అపాయం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఐఎండీ రెడ్ అలర్ట్ ఇష్యూ చేస్తుంటుంది. ఈ అలర్ట్ తో విపత్తు నిర్వహణ దళాలు, ఐఎండీ టీమ్​లు, రెస్క్యూ సహాయక సిబ్బంది(Rescue Teams)తో పాటు స్థానిక రెవెన్యూ, మున్సిపల్, పోలీస్​ సాయుధ బలగాలు అప్రమత్తంగా ఉంటాయి. 

Share post:

లేటెస్ట్