
మహాశివుడు పార్వతీ దేవిని వివాహమాడిన శుభముహూర్తాన్నే మహాశివరాత్రి (Maha Shivratri) పర్వదినంగా జరుపుకుంటామని పలు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు భక్తులు ఉపవాసం చేసి జాగరణ చేస్తే ఆ పరమేశ్వరుడి కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తుంటారు. రాత్రంతా శివనామస్మరణలో గడిపితే మహదేవుని ఆశీస్సులు పొందవచ్చని నమ్ముతారు. అందుకే చాలా మంది భక్తులు శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేస్తారు. మరి ఈ ఏడాది ఏ రోజున మహాశివరాత్రి పర్వదినం వచ్చిందో తెలుసుకుందామా..?
మహాశివరాత్రి ఎప్పుడంటే?
ఈ ఏడాది (2025)లో మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీ (బుధవారం)న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం 2025 మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో చతుర్దశి తిథి అంటే ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఉదయం 11:08 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:54 గంటలకు ముగుస్తుంది. నిషిత కాల పూజ (అర్ధరాత్రి పూజ) ఫిబ్రవరి 27వ తేదీన రాత్రి 12:09 గంటల నుంచి 12:59 గంటల సమయంలో పూజ చేస్తే చాలా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
శివలింగానికి అభిషేకం
మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు పరమేశ్వరుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. శివలింగానికి పాలు, తేనె, గంధం, బిల్వపత్రాలు, పువ్వులతో అభిషేకం చేస్తారు. ఇక దేశవ్యాప్తంగా ఈరోజున శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. పలు ఆలయాల్లో శివుడి ఊరేగింపు, హోమాలు, రుద్రాభిషేకం, కీర్తనలు జరుగుతాయి. అలా శైవాలయాల్లోనే చాలా మంది భక్తులు శివనామస్మరణలో రాత్రంతా జాగరణ చేస్తారు. ఈ పర్వదినాన చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వల్ల అన్ని కష్టాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.