Mana Enadu : మహారాష్ట్ర NCP- పవార్ వర్గం నేత బాబా సిద్ధిఖీ(Baba Siddique) ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన కుమారుడు జీషాన్ సిద్ధిఖీ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తాజాగా జీషాన్ కూడా NCPలో చేరారు. త్వరలో మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో టికెట్ దక్కకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు.
కాంగ్రెస్ నుంచి దక్కని టికెట్
ఇక తాజాగా ఆయన కాంగ్రెస్‌ను వీడి అజిత్ పవార్(Ajit Pawar NCP) లీడ్ చేస్తున్న ఎన్సీపీ వర్గంలో చేరారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ జీషాన్(Zeeshan Siddique)కు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. బాంద్రా ఈస్ట్ నుంచి ఆయణ్ను బరిలో దింపుతున్నట్టు వెల్లడించింది. గతంలో జీషాన్ కాంగ్రెస్ టికెట్‌పై వంద్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే శాసన మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్(Cross Voting)కు పాల్పడ్డారన్న ఆరోపణలతో పార్టీ ఆయన్ను బహిష్కరించింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అతడికి టికెట్ దక్కలేదు.
జీషాన్ సిద్ధిఖీకి ఎన్సీపీ టికెట్!
ఇక ఎన్సీపీ పవార్ వర్గం నేత, జీషాన్ తండ్రి బాబా సిద్ధిఖీ కొద్దిరోజుల క్రితమే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) గ్యాంగ్ చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీషాన్ ఎన్సీపీలో చేరడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఎన్సీపీ కండువా కప్పుకున్న జీషాన్ సిద్ధిఖీ…ఈ రోజు తనకు, తన కుటుంబానికి భావోద్వేగమైన రోజని అన్నారు. బాంద్రా ఈస్ట్ స్థానంలో మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన ఆయన కాంగ్రెస్ సహా మహా వికాస్ అఘాడీపై విమర్శలు గుప్పించారు. పాత మిత్రులు తమను తాము అభ్యర్థులుగా ప్రకటించుకున్నారని మండిపడ్డారు.
నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు
మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్(Maharashtra Assembly Polls 2024) నిర్వహించనున్నారు. అక్టోబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 29వ తేదీ తుది గడువు కాగా.. 30న నామపత్రాల పరిశీలన.. నవంబర్ 4 నామినేషన్ల ఉపసంహరణ గడువును ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక నవంబర్ 20వ తేదీన మహారాష్ట్రలో పోలింగ్ జరగనుంది. 23వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.