వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) ఇప్పటికే అరెస్టయి రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయనపై ఏపీ వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఆ 17 పోలీసు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు పీటీ వారెంట్లతో రెడీగా ఉన్నారు. మొత్తానికి పోసాని చుట్టు పెద్ద ఉచ్చు బిగుసుకుంటోంది.
ఒకేసారి మూడు పీటీ వారెంట్లు
ప్రస్తుతం పల్నాడు, అల్లూరి, అనంతపురం జిల్లాలకు చెందిన పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు (PT Warrant) అందించారు. అయితే ఇందులో గుంటూరు జిల్లా నరసరావు పేట అధికారులు తామే ముందుగా కోర్టు అనుమతి తీసుకున్నామని.. తమకే పోసానని అప్పగించాలని రాజంపేట పోలీసులను కోరగా వారు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో ఉన్నతాధికారులు నిబంధనలు పరిశీలించి పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు.
కాసేపట్లో నరసరావుపేటకు పోసాని
ఈ నేపథ్యంలోనే కాసేపట్లో పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali Case News)ని నరసరావుపేటకు తమ వెంట తీసుకెళ్లనున్నారు. క్రైమ్ నెంబర్ 142/2024 కింద పోసానిపై నరసరావుపేట టూ టౌన్ పీఎస్లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు చేయనున్నారు. మరోవైపు తనకు మరోసారి ఛాతీలో నొప్పి వచ్చిందని ఇవాళ ఉదయం పోసాని జైలు అధికారులకు తెలియజేయగా.. ప్రభుత్వ వైద్యులు జైలు లోపలికి వెళ్లి పోసానిని పరీక్షిస్తున్నట్లు తెలిసింది.







