చాలా మంది రాత్రి సమయంలో భోజనం (Dinner) చాలా ఆలస్యంగా చేస్తారు. చాలా వరకు 7 నుంచి 9 గంటల లోపు భోజనం చేస్తే.. కొందరు మాత్రం రాత్రి 10 దాటిన తర్వాత తింటారు. ఇలా ఆలస్యంగా భోజనం చేసేవారు ప్రమాదంలో ఉన్నట్లేనని పరిశోధకులు చెబుతున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారికి పెద్దపేగు చివర (కొలోరెక్టల్) క్యాన్సర్ వచ్చే ముప్పు ఉన్నట్టు షికాగోలోని రష్ యూనివర్సిటీ అధ్యయనంలో తేల్చింది. అదే పడుకునే మూడు గంటల్లోపు భోజనం చేసే వారిలో ఈ ముప్పు తగ్గుతున్నట్లు గుర్తించింది.
ఆలస్యంగా భోజనం చేస్తున్నారా?
రాత్రి భోజనం ఆలస్యంగా తినేవారికి చిన్న కణితి (అడినోమా) ఏర్పడే అవకాశం 46% ఎక్కువగా ఉంటున్నట్టు ఈ పరిశోధనలో తేలింది. వీరికి ఎక్కువ కణితులు తలెత్తే ముప్పు 5.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే వీటిలో దాదాపు చాలా వరకు క్యాన్సర్ హితంగానే ఉంటాయని.. కొన్ని మాత్రం క్యాన్సర్ గా మారే ముప్పు ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తారు.
జీవ గడియారం గతి తప్పితే
జీర్ణకోశంలోని జీవగడియారం గతి తప్పటం వల్ల పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఆలస్యంగా భోజనం చేసినప్పుడు అది రాత్రి సమయమని మెదడు.. ఉదయమని పేగులు భావిస్తాయట. ఆలస్యంగా భోజనం చేసేవారు ఆరోగ్యకరమైన ఆహారం కాకుండా.. కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తీసుకుంటే పేగుల్లోని జీవగడియారాన్ని ఈ పదార్థాలు అస్తవ్యస్తం చేస్తాయని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా.. దీనివల్ల బరువు పెరిగి క్యాన్సర్ ముప్పును పెంచుతుందని చెబుతున్నారు. అందుకే రాత్రి పూట 7ల వరకు.. వీలైతే 7 గంటల్లోపు భోజనం చేయాలని సూచిస్తున్నారు.








