Mana Enadu : మరికొన్ని గంటల్లో 2024 సంవత్సరం ముగియబోతోంది. ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో అంతా 2025 కొత్త ఏడాదికి సరికొత్తగా ఆహ్వానం పలకబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి 2024 గురించి రివైండ్ చేసుకుందాం. ఈ ఏడాది ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు నేరారోపణలతో కేసులు ఎదుర్కొన్నారు. కొందరైతే జైలుకు కూడా వెళ్లారు. దిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Kejriwal) నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకు ఈ ఏడాది కేసులు ఎదుర్కొని, అరెస్టయి జైలుకు వెళ్లిన ప్రముఖులు ఎవరో ఓసారి చూద్దాం..
అరవింద్ కేజ్రీవాల్
ఆప్ కన్వీనర్, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ (Delhi Excise Policy) కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో అరెస్టయ్యారు. మార్చి 21వ తేదీన ఆయణ్ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు తిహాడ్ జైలుకు తరలించారు. ఆరు నెలల తర్వాత బెయిల్ మంజూరు కావడంతో విడుదలై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ కుర్చీని మరో ఆప్ నేత అతీశీకి అప్పగించారు.
హేమంత్ సోరెన్
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemanth Soren) అరెస్టయి జైలుకెళ్లారు. అయితే జైలుకెళ్లే ముందు ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి చంపై సోరెన్ ను ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. కొన్నాళ్ల తర్వాత ఆయన బెయిల్ పై విడుదలై తిరిగి ముఖ్యమంత్రి పదవి అధిరోహించారు. నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి సీఎం కుర్చీని దక్కించుకున్నారు.
కల్వకుంట్ల కవిత
మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha Liquor Scam).. దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15వ తేదీన అరెస్టయ్యారు. కొన్ని నెలల పాటు తిహాడ్ జైల్లో ఉన్న ఆమె బెయిల్ పై విడుదలయ్యారు.
దర్శన్
కన్నడ నటుడు దర్శన్ (Darshan).. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయి జైలుకెళ్లాడు. తన ప్రేయసి పవిత్రా గౌడ్ కు అసభ్యకరమైన సందేశాలు పంపించాడన్న కారణంతో రేణుకాస్వామిని దర్శన్, పవిత్రా గౌడ్ తమ అనుచరులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో ఇటీవలే కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దర్శన్ జైలు నుంచి విడుదలయ్యాడు.
హేమ
టాలీవుడ్ నటి హేమ (Hema Arrest) బెంగళూరు రేవ్ పార్టీలో పోలీసులకు దొరికిపోగా ఆమె కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. దీంతో ఆమెను జైలుకు తరలించారు. అనంతరం రావడంతో హేమ విడుదలయ్యారు.
కస్తూరి
ప్రముఖ సినీనటి కస్తూరి (Kasturi Arrest).. చెన్నైలో తెలుగువారిపై వివాదాదస్ప వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసు నమోదయింది. హైదరాబాద్‌లో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి పుళల్ సెంట్రల్ జైలుకు తరలించగా ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.
అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 (Pushpa 2) మూవీని అభిమానులతో కలిసి చూసేందుకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తిరిగి బెయిల్‌పై కొన్ని గంటల వ్యవధిలోనే విడుదలై ఇంటికొచ్చారు.






