ఇన్ఫోసిస్(Infosys) ఫౌండేషన్ “స్ప్రింగ్‌బోర్డ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్”(“Springboard Livelihood Programme) పేరుతో ఒక విశిష్టమైన సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై 15, 2025న ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్, భారతదేశ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థిరమైన ఉపాధి అవకాశాలను అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది. ప్రారంభ దశలో రూ.200 కోట్లు మంజూరు చేయగా, 2030 నాటికి కనీసం 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ఈ ప్రాజెక్టు ముఖ్యంగా పట్టభద్రులు, గ్రామీణ యువత, స్కిల్స్ లేని నిరుద్యోగుల కోసం రూపొందించబడింది. ఇప్పటికే 2025 ఆర్థిక సంవత్సరంలో 80,000 మందికి పైగా అభ్యర్థులు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందారు. ప్రోగ్రామ్‌లో భాగంగా యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్స్ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వబడుతోంది. అదనంగా కమ్యూనికేషన్, టైమ్ మేనేజ్మెంట్, ఇంటర్వ్యూ స్కిల్స్ వంటి సోఫ్ట్ స్కిల్స్‌ను కూడా అందిస్తున్నారు.
ఇన్ఫోసిస్, IDC అకాడమీ, NIIT, మ్యాజిక్ బస్, అగా ఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్, నిర్మాణ్ సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంది. రియల్ టైమ్ ప్రాజెక్టుల ద్వారా అభ్యర్థులకు ప్రాక్టికల్ అనుభవాన్ని కల్పించడం ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మాని ప్రకారం, ఈ ప్రోగ్రామ్ యువతకు కేవలం శిక్షణే కాదు, భవిష్యత్‌కి మార్గదర్శకత కూడా ఇస్తుంది. “ఇది విజ్ఞానం, ఉద్యోగం రెండింటిని కలగజేస్తూ, వారికి విశ్వాసం నింపుతుంది,” అని ఆయన పేర్కొన్నారు.
ఉన్నతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రమేష్ స్వామి ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ, ఇది యువత జీవితాల్లో వాస్తవమైన మార్పునకు దారితీసే ఉద్యమంగా నిలుస్తుందని చెప్పారు.






