హెచ్ఐవీ (HIV) ఎయిడ్స్ కేసులు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతుంటే.. ఈ ప్రాంణాంతకమైన వ్యాధి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) మాత్రం కంట్రోల్లో లేదు. హెచ్ఐవీ రోగుల సంఖ్య తగ్గించేందుకు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం కృషి చేస్తున్నా పలితం పెద్దగా కనిపించడంలేదు. రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముంబైలో ప్రస్తుతం 40,658 హెచ్ఐవీ కేసులున్నట్లు ఆ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ వెల్లడించింది. మహారాష్ట్ర (maharashtra) ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ముంబైలో ఈ సంవత్సరం కొత్తగా 3 వేల మందికి వ్యాధి సోకినట్లు స్పష్టం చేసింది.
ఆందోళనలో ప్రభుత్వం
హెచ్ఐవీని క్రమంగా తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. జనజాగృతి, కళాజాత ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తోంది. అయినప్పటికీ ముంబైలో కేసులు పెరుగుతూనే పోతున్నాయ. ప్రతి ఏటా కొత్తగా మూడు వేల మందికి వ్యాధి నిర్ధారణ అవుతుండడం అక్కడి వైద్యారోగ్యశాఖ, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డును ఆందోళనకు గురిచేస్తోంది. (HIV cases in mumbai) కొత్తగా వ్యాధి సోకుతున్న వారిలో 75 శాతం మంది 15 నుంచి 50 ఏండ్ల మధ్య వారే ఉంటున్నారని సర్వే స్పష్టం చేస్తోంది. వీరిలో 69 శాతం మంది పురుషులు ఉండగా.. 31 శాతం మంది మహిళలు ఉన్నారు.
విస్తృత పరీక్షలు
రక్షణ ప్రమాణాలు పాటించకుండా సెక్స్‌లో పాల్గొనడం, అక్రమ సంబంధాల వల్ల HIV కేసులు పెరుగుతున్నట్లు వైద్య పరిశీలనలో వెల్లడైంది. కేసులు పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్న ఆధికారులు విస్తృత పరీక్షలు చేస్తున్నారు. ముంబైలో 20కి పైగా కేంద్రాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోగులకు ఉచితంగా మందులు లభించేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పిస్తున్నారు.








