Mana Enadu : భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్స్ మెడల్ విన్నర్ పీవీ సింధు (PV Sindhu) తీపి కబురు చెప్పారు. త్వరలోనే ఈ స్టార్ షట్లర్ పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ఆమె మ్యారేజ్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 22వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి వివాహం రంగరంగ వైభవంగా జరగనుంది.
రాజస్థాన్‌లో పెళ్లి.. హైదరాబాద్‌లో రిసెప్షన్
డిసెంబర్ 24వ తేదీన హైదరాబాద్‌లో రిసెప్షన్ (PV Sindhu Marriage) ఏర్పాటు చేయనున్నట్లు సింధు తండ్రి పీవీ రమణ తెలిపారు. పెళ్లికి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు ఈనెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలా కాలంగా తెలుసని.. గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. జనవరి నుంచి సింధు షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి చేయనున్నట్లు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వచ్చే సీజన్ తనకు ఎంతో ముఖ్యమైనది అని సింధు తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు.
సింధు మనువాడే అతడేం చేస్తుంటాడంటే
సింధు వివాహం చేసుకోనున్న వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మరోవైపు రెండేళ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం వేచి చూస్తున్న పీవీ సింధు సోమవారం (డిసెంబరు 2) జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషన్ సూపర్ 300 టోర్నీ ఫైనల్‌లో గెలుపొందింది. చైనా క్రీడాకారిణి వు లుయో యును వరుస గేమ్‌ల్లో చిత్తుచేసింది. చివరి సారిగా 2022 జులైలో సింగపూర్ ఓపెన్ విజేతగా సింధు నిలిచింది.
రెండు ఒలింపిక్ మెడల్స్
2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు (PV Sindhu Olympic Medals) తొలిసారి రజత పతకం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి.. వరుసగా రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు క్రియేట్ చేసింది. 2017లో వరల్డ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి నెంబర్ 2 స్థాయికి చేరింది పీవీ సింధు. ఇలా తన ఆటలో సత్తా చాటుతున్న సింధు.. తాజాగా తన పర్సనల్ లైఫ్ లో త్వరలోనే కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతోంది.






