వారం రోజుల క్రితం కుయ్ కుయ్ అంటూ చక్కర్లు కొడుతున్న అంబులెన్స్ చూసి ప్రజలు సంబురపడ్డారు. క్షణాల్లో అత్యవసర సేవలు పొందే అవకాశం దొరికిందని మురిసిపోయారు. వారం రోజులుగా 108కి డయల్ చేస్తే మీ మండలానికి కేటాయించిన వాహనం అందుబాటులో లేదని, మరోప్రాంతం నుంచి అరగంట సమయం తర్వాత వాహనాన్ని పంపిస్తున్నారు. చింతకాని మండల ప్రజలకు అత్యవసర సేవలు అందించాలని కేటాయించిన అంబులెన్స్ వారం రోజులకే పరిమితం అయింది.
ఇటీవల ఖమ్మం జిల్లాకు అంబులెన్స్ వాహనాలు సేవలు అవసరం ఉన్నాయని వైద్యాధికారుల గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీంతో జిల్లా పరిధిలలోని కొణిజర్ల, కారేపల్లి, పెనుబల్లి, చింతకాని, వేంసూరు మండలాలకు కొత్త అంబులెన్స్ వాహనాలను పంపించింది.
8 రోజుల క్రితమే ఎమర్జెన్సీ వాహనాలు ఆసుపత్రులకు చేరుకున్నాయి. వెహికల్ నంబర్లతో జీపీఎస్(GPS) ట్రాకర్‌ను యాక్టివేట్ చేశారు. చింతకాని వాహనానికీ పీహెచ్సీ, జీపీఎస్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ధ్రువీకరించారు. ఈ క్రమంలో ఉన్నఫళంగా ఇక్కడి వాహనాన్ని సూర్యాపేట జిల్లా కోదాడకు కేటాయిస్తూ ఆదివారం అక్కడకు పంపారు.
డిప్యూటీ సీఎం మండలానికే ఇలా:
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోనే అధికారులు తీరు పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చింతకాని మండలానికి కేటాయించిన అంబులెన్స్ జిల్లా దాటించడంతో వైద్యశాఖ ఉన్నతాధికారులు పట్ల విమర్శలు వినపిస్తున్నాయి.
ప్రధానంగా మండల పరిధిలోని చిన్నమండవ, తిమ్మినేనిపాలెం, అనంతసాగర్, బొప్పారం, ప్రొద్దుటూరు, నాగిలిగొండ, కోమట్లగూడెం, నేరడ గ్రామాలు బోనకల్లుకు, ఖమ్మం నగరానికి దూరంగా ఉంటాయి.






