తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao ) కన్నుమూశారు.ఈ రోజు ఉదయం (జూలై 13) ఆదివారం(Sunday) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది.

సినీ పరిశ్రమలో ఆయన ఓ అపూర్వమైన నటుడిగా నిలిచిపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ విలన్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా అన్నిరకాల పాత్రల్లో విలక్షణమైన నటనతో మెప్పించిన కోట శ్రీనివాస రావు ను అభిమానులు ప్రేమగా “కోట” అని పిలుచుకుంటారు. చిన్ననాటి నుంచే నాటకాలు, సినిమాలంటే కోటకు మక్కువ ఉండేది.

సినిమాల్లోకి అడుగుపెట్టే ముందు స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేశారు. మంచి ఉద్యోగం, స్థిరమైన జీవితం వదిలిపెట్టి తన కలలను నెరవేర్చేందుకు సినిమా రంగంలోకి ప్రవేశించారు. 1978లో వచ్చిన “ప్రాణం ఖరీదు”(Pranam Kareedu) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ నటనలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

తన సినీ ప్రయాణంలో అనేక గొప్ప సినిమాల్లో నటించారు కోట. కామెడీ పండించే నటనతో ప్రేక్షకులను నవ్విస్తూ మాంత్రికుడిగా మారిపోయారు. అయితే ఆయనకు అసలైన గుర్తింపు తీసుకువచ్చిన సినిమా “ప్రతిఘటన”(Prathi Ghatana). ఈ సినిమాతో ఆయన ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు.

ఒక ఇంటర్వ్యూలో కోట మాట్లాడుతూ.. “నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమా ప్రతిఘటనే. నా కెరీర్‌కు ప్లస్ అయిన చిత్రం అదే” అని తెలిపారు. మొదట్లో చిన్న పాత్ర కోసమే తీసుకున్నా, సినిమాలో కోట చెప్పిన డైలాగ్‌ని చూసి డైరెక్టర్ టీ. కృష్ణ ఎంతో ఆకర్షితులయ్యారు. కోట నటన చూసి పాత్రను విస్తరించి, ప్రత్యేకంగా సన్నివేశాలు రాసారని చెప్పారు.

“ఆ రాత్రంతా కూర్చొని నా పాత్రకు సంబంధించిన సీన్లను రాశాడు డైరెక్టర్ టీ. కృష్ణ. ఆ సినిమా నాకు పేరును, ప్రాధాన్యతను తీసుకొచ్చింది. నన్ను నటుడిగా నిలబెట్టింది” అని కోట శ్రీనివాసరావు ఎమోషనల్‌గా వెల్లడించారు.






