ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Sessions 2025) కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పాఠశాలల్లో ప్రహరీలు, మెగా డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. మెగా డీఎస్సీ (Mega DSC 2025) ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు .
డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ టీమ్స్
‘‘మన బడి-మన భవిష్యత్తు”.. నినాదంతో ఉపాధి హమీ కింద దశల వారీగా స్కూళ్ల ప్రహరీ గోడలను నిర్మిస్తామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ గోడల నిర్మాణానికి రూ.3వేల కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి పాఠశాల, కాలేజీల్లో ‘ఈగల్’ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
టీవీలు పగిలిపోతాయ్
మరోవైపు మెగా డీఎస్సీపై వైస్సార్సీపీ సభ్యులు (YSRCP MLAs) అడిగిన ప్రశ్నపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వైస్సార్సీపీ నేతలు అసెంబ్లీకి హాజరు కాలేదు. అయినా వారి ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తాను. అని మంత్రి లోకేశ్ సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుకు తెలపగా.. టీవీలో అయినా వైసీపీ సభ్యులు సమాధానం చూసుకుంటారని రఘురామ అన్నారు. ‘‘అలా చేస్తే టీవీలు పగిలిపోతాయి’’ అని లోకేశ్ అనడంతో సభలో నవ్వులు పూశాయి.







