సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఓనర్, నిర్మాత నాగవంశీ (Naga Vamsi) మీడియా, న్యూస్ వెబ్ సైట్లపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. తాను సినిమాలు తీస్తేనే వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు నడుస్తున్నాయని అన్నారు. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన సినిమా రివ్యూలు, వాటిపై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న పలు పోస్టులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించరని ప్రశ్నించారు. ఇటీవల తమ బ్యానర్ నుంచి రిలీజ్ అయిన ‘మ్యాడ్ స్క్వేర్ (Mad Square)’ మూవీలో కంటెంట్ ఉంది కాబట్టే, హిట్ అయిందని అన్నారు.
మీడియాపై నాగవంశీ ఫైర్
మ్యాడ్ స్వ్కేర్ లో కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతోందని చాలా మంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఎలా ఉన్నా చూడ్డానికి ఇదేం ‘బాహుబలి2’, ‘పుష్ప2’, ‘కేజీఎఫ్2 (KGF 2)’ కాదు కదా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. సినిమా బాలేకపోయినా చూడ్డానికి ఇందులో నటించిన వాళ్లంతా పెద్ద స్టార్లు కాదుగా అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని సినిమా వెబ్ సైట్లు కూడా ఇలాంటి రివ్య్యూలు రాశాయి. దీంతో ఇలాంటి కామెంట్స్ పై తాజాగా నాగవంశీ స్పందిస్తూ తీవ్రంగా ఫైర్ అయ్యారు.
అది కూడా తెలియడం లేదా బాసూ
“పక్క సినిమా బాగోలేదని ఇటీవల రిలీజ్ అయిన కోర్టు (Court) చిత్రాన్ని జనం ఆదరించలేదు. అది బాగుంది కాబట్టే ఆ సినిమా చూశారు. అలాగే ‘మ్యాడ్ స్క్వేర్’ బాగుంది కాబట్టి చూస్తున్నారు. నేను థియేటర్లో చాలాసార్లు సినిమా చూశా. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. జనాలకు తెలిసినంత బాగా రివ్యూవర్లకు తెలియడం లేదా. మీరు (మీడియా) మేమూ కలిసి పని చేయాలి.
అందరం ఇంటికి వెళ్లాల్సిందే
నేను సినిమాలు తీస్తేనే మీ వెబ్సైట్స్ రన్ అవుతున్నాయి. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానళ్లు నడుస్తున్నాయి. మేం యాడ్స్ ఇస్తేనే మీ సైట్స్ పని చేస్తాయి. సినిమాను చంపకండి. సినిమా బాగా రన్ అవుతున్నప్పుడు ‘కంటెంట్ లేని మూవీ ఎందుకు ఆడుతుందో తెలియదు’ అంటూ తీర్పులు ఇవ్వకండి. సినిమాలు ఆడితేనే మీరూ మేం ఉంటాం. లేకపోతే అందరం తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి వెళ్లాల్సిందే.’’ అంటూ నాగవంశీ (Naga Vamsi Fires) ఆగ్రహం వ్యక్తం చేశారు.






