ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Maha Kumbh Mela)లో ఇవాళ ఘోరం జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం రోజున విపరీతమైన రద్దీ నెలకొనడంతో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 20 మంది దాకా మృతి చెందినట్లు సమాచారం. వందల మంది గాయపడినట్లు తెలిసింది. అయితే ఎంత మంది మరణించారు.. ఎంతమంది గాయపడ్డారు అన్న విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. మరోవైపు సహాయక చర్యల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు.
రాజస్నానం రద్దు
మహా కుంభమేళాలో ఆరు రాజస్నానాలు ఉంటాయి. మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా అందులో మూడోది ఇవాళ జరగాల్సి ఉంది. అయితే తొక్కిసలాట సందర్భంగా రాజస్నానాన్ని రద్దు చేశారు. రథంపై ఉన్న సాధువులు సామాన్య ప్రజలతో స్నానాలు చేశారు. మరోవైపు కుంభమేళాలో సామూహిక స్నానాన్ని రద్దు చేసినట్లు స్వామి చిదానంద సరస్వతి తెలిపారు. ఎక్కడున్నవారు అక్కడే స్నానం చేయాలని సూచించారు.
అసలేం జరిగిందంటే..
మౌని అమావాస్యను పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంగళవారం రాత్రి నుంచే ప్రయాగ్‌రాజ్‌లోని (Prayag Raj) త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో బారికేడ్లు విరిగాయి. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 20 మంది మరణించినట్లు సమాచారం. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది గాయపడిన వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఘటనపై ప్రధాని ఆరా
తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ (CM Yogi) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆయన ఫోన్ చేసి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించాలని భక్తులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు.






