ManaEnadu:ఆగస్టులో థియేటర్లలో సందడి చేసిన సినిమాల్లో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో ఒకటి ‘కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu)’. యదు వంశీ అనే కొత్త డైరెక్టర్ దాదాపు 19 మంది కొత్త నటులతో ఈ సినిమాను తెరకెక్కించాడు. మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక థియేటర్లలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ‘ఈటీవీ విన్ (ETV Win)’ ఓటీటీలో ఈ మూవీ రాబోతున్నట్లు ప్రకటించారు. ‘‘కమిటీ కుర్రోళ్ళు’ సెప్టెంబరులోనే రాబోతున్నారు’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది ఓటీటీ. విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే వినాయక చవితి (Vinayaka Chaviti)ని పురస్కరించుకుని సెప్టెంబరు తొలి వారంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశాలున్నాయని నెటిజన్లు అంటున్నారు.
కమిటీ కుర్రోళ్ల కథ ఏంటంటే..? : గోదావరి జిల్లాల్లోని ఓ మారుమూల పల్లెటూరు పురుషోత్తంపల్లిలో పన్నెండేళ్లకు ఒకసారి భరింకాళమ్మతల్లి జాతర జరుగుతుంది. ఈసారి జాతర జరిగిన పదిరోజులకు ఊరి సర్పంచ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆ ఊరి ప్రస్తుత సర్పంచ్ బుజ్జి (సాయికుమార్)పై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రాళ్లలో ఒకడైన శివ (సందీప్ సరోజ్) ముందుకొస్తాడు. గత జాతర సమయంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టకూడదని పంచాయితీలో ఊరి పెద్దలు తీర్పునిస్తారు. ఆ తర్వాత ఏమైంది? పన్నెండేళ్ల క్రితం కులాల గొడవ వల్ల విడిపోయిన శివ మిత్ర బృందం తిరిగి ఎలా ఒక్కటైంది? ఊరి సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అన్నదే కమిటీ కుర్రోళ్ల కథ.






