హిందీ, తెలుగు, భోజ్‌పురి, కన్నడ, తమిళ భాషల సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు రవికిషన్(Ravi Kishan). ముఖ్యంగా భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన, ఇతర భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించాడు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో నటించిన ‘రేసు గుర్రం’ సినిమాతో అడుగుపెట్టిన రవికిషన్, తన తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత కిక్ 2, రాధే, సుప్రీమ్, ఎమ్మెల్యే, లై, సాక్ష్యం, హీరో వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి తన నటనతో ప్రశంసలు పొందాడు. విలన్ పాత్రలతో పాటు సహాయ పాత్రల్లోనూ ఆకట్టుకున్న ఆయన, తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించాడు.
వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, రవికిషన్ 1993లో ప్రీతి శుక్లాను వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు. ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. ఇందులో ఓ కుమార్తె భారత ఆర్మీలో చేరి దేశసేవలో నిమగ్నమవగా, మరో కుమార్తె రివా కిషన్(Riva Kishan) తన తండ్రి అడుగుజాడల్లో నడిచి నటనలో ప్రవేశించింది.
రివా తన నటన ప్రయాణాన్ని 2015లో పరిందో కి మెహ్ఫిల్ అనే చిత్రంతో ప్రారంభించింది. ఈ సినిమాలో నటి హీబా షా (నసీరుద్దీన్ షా కుమార్తె)తో కలిసి నటించింది. డ్యాన్స్ మీద ఆసక్తితో 2016లో ముంబైలోని టెరెన్స్ లూయిస్ డ్యాన్స్ అకాడమీలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొందింది. 2022లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రివా, సబ్ కుశల్ మంగల్ సినిమాతో తొలి ప్రయత్నంలోనే నటిగా మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నటన రంగంలో సక్సెస్ఫుల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.
View this post on Instagram






