ఎయిరిండియా.. భలేగా మారిపోయిందయా

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ప్రముఖ పౌర విమానయాన సంస్థ ఎయిరిండియా.. సరికొత్తగా తయారుకానుంది. ఎయిరిండియా విమానాలన్నీ కలర్‌ఫుల్‌గా మారిపోనున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా తన మార్కెటింగ్ స్ట్రాటజీని తీర్చిదిద్దుకుంటోందా కంపెనీ యాజమాన్యం. ప్రయాణికులను మరింత ఆకట్టుకునేలా చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా- ఎయిరిండియా లోగోను మార్చివేసింది. ఇప్పటివరకు ఉన్న వీల్స్ ఆఫ్ కోణార్క్, మహారాజా లోగోను తొలగించింది. దాని స్థానంలో కొత్త లోగోను రూపొందించింది. కొద్దిసేపటి కిందటే ఆ కంపెనీ యాజమాన్యం.. దీన్ని ఆవిష్కరించింది. గాల్లో దూసుకెళ్తోన్న పక్షి ఆకారంలో కొత్త లోగోను తయారు చేసింది. ఈ కొత్త లోగో పేరు- ది విస్టా

టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. ఈ లోగోను ఆవిష్కరించారు. తమ ఎయిర్‌లైన్స్ సంస్థను ప్రపంచంలోనే అత్యుత్తమంగా, అత్యున్నతంగా తీర్చిదిద్దడంలో ఏ మాత్రం వెనుకంజ వేయబోమని అన్నారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించడంలో ముందుంటామని స్పష్టం చేశారు.

ఎయిరిండియా కొత్త లోగో చిహ్నాన్ని రూపొందించడంలో గోల్డ్ విండో ఫ్రేమ్, మౌంటెయిన్ పీక్ నుంచి తాము స్ఫూర్తి పొందినట్లు చంద్రశేఖరన్ వివరించారు. గోల్డ్ విండో ఫ్రేమ్ అనేది- అపరిమితమైన అవకాశాలు, పురోగమనానికి ప్రతీకగా అభివర్ణించారు. మంటెయిన్ పీక్ అనేది- అచంచలన విశ్వాసాన్ని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక ఎయిరిండియా అనే అక్షరాల లిపిని కూడా మార్చేసింది. కొత్త కలర్ కాంబినేషన్, బోల్డ్ రెడ్ అక్షరాలను కలిగి ఉంది. దీని ఫాంట్ మారింది. తెలుపు రంగులో రాసిన ఎయిరిండియా అనే అక్షరాలు, విమానాల అండర్‌బెల్లీపై ఎరుపు రంగు పాచ్‌ను ఇందులో మిళితం చేశారు. కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ లైవరీ, డిజైన్‌లో ముదురు ఎరుపు, పర్పుల్, బంగారు రంగులతో కళ్లు మిరుమిట్లు గొలిపేలా రూపొందించారు

Share post:

లేటెస్ట్