ఏపీ ఉన్నత విద్యలో గేమ్ ఛేంజర్. సర్కార్ మరియు ఆన్‌లైన్ కోర్సు సంస్థ ఎడెక్స్ మధ్య ముఖ్యమైన ఒప్పందం.

ఏపీలో భారీ ఎత్తున విద్యాసంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఇందులో భాగంగా ఇవాళ మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నతవిద్యలో విద్యార్ధులకు ప్రపంచస్థాయి కోర్సులు అందించే లక్ష్యంతో ప్రముఖ ఆన్ లైన్ కోర్సుల సంస్ధ ఎడెక్స్ తో కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో హార్వర్డ్‌, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్‌, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లు అందించేందుకు వీలు కలగబోతోంది. ఏపీ ఉన్నత విద్యారంగంలో ఇది గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం జగన్ వెల్లడించారు.

ఉన్నతవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా అంతర్జాతీయ కోర్సులు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. విఖ్యాత విశ్వవిద్యాలయాలు హార్వర్డ్‌, మసాచుసెట్స్‌ సంయుక్తంగా ఎడెక్స్‌ను రూపొందించాయి. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ప్రపంచస్థాయి పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఎడెక్స్ ఆన్ లైన్ లో కోర్సులు అందిస్తోంది. ఈ ఒప్పందంపై ఎడెక్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ, పద్మశ్రీ అవార్డు గ్రహీత అనంత్‌ అగర్వాల్‌, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె శ్యామలరావు సంతకాలు చేశారు.

నిరుపేద విద్యార్థులకు ఈ ఒప్పందంతో మరింత మేలు జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్‌, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్‌ సంయుక్త సర్టిఫికేషన్‌ విద్యార్థులకు లభిస్తుందన్నారు. వారికి ఉచితంగా ఈ కోర్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఈ సర్టిఫికెట్లు మరింతగా మెరుగుపరుస్తాయన్నారు.

విదేశాలకు వెళ్లి చదువుకోవడం అన్నది చాలామంది విద్యార్థులకు గగనమైన విషయమని, అలాంటిది ఆయా యూనివర్శిటీల కోర్సులను, అందులోనూ ప్రపంచ ప్రసిద్ధిచెందిన యూనివర్శిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే అవకాశం ఈ ఒప్పందంతో లభిస్తుందని సీఎం తెలిపారు. ప్రపంచంలో అనూహ్యంగా వస్తున్న శాస్త్ర, సాంకేతిక, సామాజిక , సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన మార్పులపై ఉన్న వివిధ రకాల సబ్జెక్టులు, ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయన్నారు.
మన దేశంలో లభ్యంకాని ఎన్నోకోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుందన్నారు. అలాగే వివిధ కోర్సులకు అందుబాటులోలేని బోధనా సిబ్బంది కొరతను కూడా దీనిద్వారా అధిగమించినట్టు అవుతుందన్నారు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ లాంటి కోర్సులే కాదు, ఆర్ట్స్‌, కామర్స్‌లో పలురకాల సబ్జెక్టులకు చెందిన కోర్సులు… ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతోపాటు ఉన్నత విద్యలో సిలబస్‌ను పూర్తిస్థాయిలో పునఃపరిశీలన చేయాల్సి ఉందన్నారు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ సహా ఆర్ట్స్‌, కామర్స్‌ తదితర కోర్సులన్నింటినీ కూడా రీ డిజైన్‌ చేయాలన్నారు

ఆధునికతను అందిపుచ్చుకోవడం, నాణ్యమైన విద్యను అందచేయడం లక్ష్యంగా ఈ కోర్సులను తీర్చిదిద్దాలని జగన్ తెలిపారు. ఈ కోర్సులకు వర్టికల్స్‌ కూడా ఉండాలన్నారు. విద్యార్థి తనకు కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకుని చదువుకునే అవకాశం ఉండాలన్నారు. దీనికోసం ఇప్పుడున్న ప్రతికోర్సులనూ, అందులో ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులను పూర్తిగా పరిశీలించాలన్నారు. దీనికోసం ఒక బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. అంతిమంగా మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు దక్కాలన్నారు.

Share post:

లేటెస్ట్