కార్ల కంపెనీ సంచలనం.. ఒక్కరోజులోనే రూ. 3.2 లక్షల కోట్ల లాభం.

సాధారణంగా స్టాక్ మార్కెట్లలోకి ఏదైనా షేరు ఎంట్రీ ఇచ్చిన తొలి రోజు ఎంత పెరగొచ్చు.. మహా అయితే గరిష్టంగా 50 శాతం వరకు పెరిగి లిస్ట్ అవ్వొచ్చేమో. కానీ ఇక్కడ ఒక స్టాక్ ఏకంగా 255 శాతం పెరిగింది. అంతే ఆ సంస్థ ఫౌండర్‌కు ఏకంగా లక్షల కోట్ల ఆదాయం వచ్చిపడింది. అదీ ఒక్కరోజులోనే. ఇంతకీ అదేం స్టాక్. ఎక్కడో చూద్దాం.

ఊహించని రీతిలో లాభాలు, ఆదాయం వస్తే ఏమంటారు.. అదృష్టం తలుపు తట్టిందంటుంటారు. అదే మరి ఒక్కరోజులోనే ఏకంగా రూ. 3.2 లక్షల కోట్ల ఆదాయం వస్తే దాన్నేమనాలి మరి. అదృష్టం కాదు.. అంతకుమించి అనాల్సిందే. వియత్నాంకు చెందిన ఆటోమొబైల్ సంస్థ.. విన్‌ఫాస్ట్ ఆటో లిమిటెడ్ షేరు.. అమెరికా స్టాక్ మార్కెట్‌లో మంగళవారం లిస్ట్ అయింది. మొదటిరోజే రికార్డు స్థాయిలో ఏకంగా 255 శాతం దూసుకెళ్లగా.. ఆ సంస్థ ఫౌండర్ ఆదాయం ఎన్నో రెట్లు పెరిగిపోయింది. దీంతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

ఆగస్ట్ 15న విన్‌ఫాస్ట్ షేరు ఏకంగా 255 శాతం వృద్ధి చెందగా.. కంపెనీ ఛైర్మన్ వియత్నాంకు చెందిన ఫామ్ నాట్ వుంగ్ నికర సంపద ఏకంగా 39 బిలియన్ డాలర్లు భారత కరెన్సీలో రూ.3.2 లక్షల కోట్లు పెరిగింది. ఇప్పటికే ఈ ఇండస్ట్రీలో దిగ్గజాలుగా ఉన్న జనరల్ మోటార్స్ కో, మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ AG, ఫోర్డ్ కంటే కూడా విన్‌ఫాస్ట్ కంపెనీ మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం కార్ల తయారీలో అమెరికా మార్కెట్‌ను జనరల్ మోటార్స్, ఫోర్డు ఏలుతుండగా.. ఒక్కరోజులోనే వియత్నాం కార్ల కంపెనీ మార్కెట్ విలువలో వీటిని దాటేయడం విశేషం.

ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం వియత్నాంకు చెందిన బిలియనీర్ ఫామ్ సంపద.. 44.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత కరెన్సీలో ఇది రూ. 3.68 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇక ఈయన ఇప్పటికే వియత్నాంలో అత్యంత సంపన్నుడిగా ఘనత సాధించారు.

వుంగ్ తొలుత తన కంపెనీని సాధారణ పబ్లిక్ ఆఫర్ కింద.. అమెరికాలో లిస్ట్ చేద్దామనుకున్నారు. కానీ గత సంవత్సరం స్టార్టప్‌ల్లో నష్టాలు వచ్చిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అంతలా ఆసక్తి చూపట్లేదని గమనించారీయన. SPAC (స్పెషల్ పర్పస్ అక్విజేషన్ కంపెనీ) ఒప్పందం ద్వారా షేర్లు విక్రయించారు. క్యాసినో రారాజుగా పేరున్న లారెన్స్ హోకు చెందిన బ్లాక్ స్పాడ్ అక్విజేషన్‌లో విలీనానికి అంగీకరించారు. అంటే స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ కాని కంపెనీని.. అప్పటికే స్టాక్ ఎక్స్చేంజీల్లో ఉన్న కంపెనీతో విలీనం చేయడం అన్నమాట. దీంతో మంగళవారం ఏకంగా 185 మి.డాలర్ల షేర్లు ట్రేడయ్యాయి. 2017లో సింగపూర్ ప్రధాన కేంద్రంగా విన్‌ఫాస్ట్‌ను స్థాపించారు ఫామ్ వుంగ్.

Share post:

Popular