“మూసీ ప్రక్షాళన తప్పకుండా చేయాల్సిందే. నదీ గర్భం, బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్)లో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించాలి. అలాగే నదిలో కలుస్తున్న మురుగు, వ్యర్థనీటిని పూర్తిగా ఆపాలి” – తెలంగాణ హైకోర్టు
Mana Enadu : తెలంగాణ హైకోర్టు (Telangana HC) వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులు మూసీలో మొత్తం 12 హాట్ స్పాట్లు గుర్తించారు. పొల్యుషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) రికార్డుల ప్రకారం హైదరాబాద్ (Hyderabad) జిల్లాలో 2, మేడ్చల్‌లో 1, రంగారెడ్డిలో 2, యాదాద్రిలో 3, సూర్యాపేటలో 2, నల్గొండలో 2 హాట్ స్పాట్లున్నాయి. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో జన్మించిన మూసీ నల్గొండ జిల్లాలోని వాడపల్లి అనే ప్రాంతం వద్ద కృష్ణాలో కలుస్తుంది. ఈ నదీ పరీవాహకంలో ఉన్న 520 ఇండస్ట్రీల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల ఈ నదీజలాలు తీవ్రంగా కలుషితం అవుతున్నాయి.
520 ఇండస్ట్రీలు.. 5.65 మి.లీ. వ్యర్థాలు
520 ఇండస్ట్రీల్లో 194 పరిశ్రమల నుంచి 5.65 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు మూసీలోకి విడుదలవుతున్నాయి. వాటిని శుద్ధి చేసి అక్కడే పునర్వినియోగించు కుంటున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) తెలిపింది. మిగిలిన 326 పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కామన్ ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు వెళ్తున్నాయని.. అక్కడ శుద్ధి చేశాక ప్రతిరోజు 4 మిలియన్ లీటర్ల జలాలు అంబర్‌పేటలో నదిలో కలుస్తాయని వెల్లడించింది.
12 హాట్ స్పాట్ల నుంచి నమూనాల సేకరణ
పీసీబీ అధికారులు ప్రతి నెల పీర్జాదిగూడ, ప్రతాపసింగారం, బాపూఘాట్, మూసారాంబాగ్, నాగోల్, ఉప్పల్ నల్లచెరువు అవుట్‌లెట్ (Uppal Nalla Cheruvu), పిల్లాయిపల్లి, సోలిపేట, భీమారం, వాడపల్లి రుద్రవెల్లి వంతెన, వలిగొండ వంతెన 12 హాట్‌స్పాట్ల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. ఆగస్టు నెల గణాంకాలను పరిశీలిస్తే కాలుష్యం తీవ్రత అన్ని చోట్లా ప్రమాదకర స్థాయిని మించినట్లు సమాచారం.
వ్యర్థాలన్నీ మూసీలోకే
జీడిమెట్ల, నాచారం పారిశ్రామికవాడల్లోని డ్రైనేజీలు రసాయన వ్యర్థాలు (Chemical Wastage) మూసీలోకి వెళ్తున్నాయి. జీడిమెట్ల సమీపంలోని సుభాష్‌నగర్ డివిజన్ వెంకటాద్రినగర్‌లో ఇటీవల మ్యాన్‌హోల్ నుంచి ఎరుపురంగు నీరు ఉబికి వచ్చి రోడ్లపై పారడంతో స్థానికులు ఆందోళన చెందారు. మరోవైపు అత్తాపూర్‌లోని బాపూఘాట్ బ్రిడ్జి వద్ద పాశమైలారంలోని ఓ పరిశ్రమకు చెందిన కెమికల్ వ్యర్థాలను మూసీలో కలుపుతున్న ట్యాంకర్లను స్థానికులు పట్టుకుని ఇలాంటి పరిశ్రమలన్నీ తమ వ్యర్థాలను ఎక్కడికక్కడ పూర్తిస్థాయిలో శుద్ధి చేసుకుని, పునర్వినియోగించుకునే విధంగా జీరో లిక్విడ్ డిశ్ఛార్జి విధానాన్ని (Zero Liquid Discharge Process) అమలు చేయాలని డిమాండ్ చేశారు.