ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ఏటా రెండు సార్లు పోలీసు పతకాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం (2025) కూడా రిపబ్లిక్ డే (జనవరి 26) (Republic Day) సందర్భంగా కేంద్ర హోంశాఖ (MHA).. పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాల (Police Medals)ను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 942 మందికి పతకాలు
ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 942 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలు (police gallantry medal) అందజేయనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈమేరకు శనివారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 95 మందికి మెడల్ ఫర్ గ్యాలంట్రీ (Medal For Gallantry ), ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పతకాలు ప్రకటించింది. మరోవైపు 101 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 746 మందికి పోలీస్ విశిష్ఠ సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలు అందజేయనున్నట్లు తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎందరికంటే..
గణతంత్ర దినోత్సవ పురస్కారాల్లో తెలంగాణ నుంచి 12 మందికి పోలీస్ విశిష్ఠ సేవా (Medal For Meritorious Service ) పతకాలు లభించాయి. తెలంగాణ నుంచి పోలీసు కమిషనర్ విక్రమ్ సింగ్ మన్, ఎస్పీ మెట్టు మాణిక్‌రాజ్ రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలకు ఎంపిక కాగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి చీఫ్ హెడ్ వార్డర్ కడాలి అర్జునరావు, వార్డర్ ఉండ్రాజవరపు వీరవెంకట సత్యనారాయణకు కరెక్షనల్ సర్వీస్ విభాగంలో పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి.






