Mana Enadu : ‘ఏడుకొండల వాడా.. వేంకట రమణా.. గోవిందా.. గోవిందా’, ‘శ్రీనివాసా గోవిందా.. శ్రీవేంకటేశా గోవిందా’, ఇలా గోవింద నామస్మరణలతో తిరుమాడ వీధులు మార్మోగుతున్నాయి. తిరుమల కొండపై ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల (Tirumala Brahmotsavam 2024)తో తిరుమల కొండ సందడిగా మారింది. స్వామి వారి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
మురళీకృష్ణుడి అవతారంలో శ్రీవారు
ఇక బ్రహ్మోత్సవా(2024 Srivari Brahmotsavam)ల్లో భాగంగా శనివారం ఉదయం స్వామి వారిని చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. మురళీకృష్ణుడి అవతారంలో ఆయన భక్తులను కనువిందు చేశారు. 10 గంటల వరకు చిన్నశేష వాహనసేవ కొనసాగనుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది. అయితే చిన్నశేష వాహనం(Chinna Sesha Vahanam)పై ఉన్న శ్రీనివాసుడిని దర్శించుకుంటే సమస్త నాగ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
వాసుకీ ఎవరు?
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని నమ్మకం. మహాభాగవతం ప్రకారం, క్షీర సాగర మధనంలో మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకొని సాగరాన్ని మదించిన విషయం విదితమే. హిందూ మత విశ్వాసాల ప్రకారం వాసుకి నాగులకు రాజు. అందుకే చిన్న శేషవాహనంపై ఊరేగే శ్రీవారి(Srivari Chinna Sesha Vahanam)ని దర్శిస్తే సమస్త నాగ దోషాలు పోయి వివాహం, సంతానం వంటి శుభ ఫలితాలను పొందవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం.






