Mana Enadu : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీ సన్నాలకు మాత్రమేనని కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Govt) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ (Rs.500 Bonus For Fine Rice)ను ఈ వానాకాలం సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం వడ్ల కొనుగోలు కోసం 7,139 కేంద్రాలు ఏర్పాటు చేయనుంది.
ఈ కేంద్రాల్లో ఎన్నింటిని సన్న వడ్ల (Fine Rice Procurement) కొనుగోళ్లకు కేటాయించాలనే నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు అప్పజెప్పింది. ఇక జిల్లా పాలనాధికారులు దిగుబడి ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. సన్నాల కొనుగోలుకు బోనస్‌గా రూ.2,400 కోట్లును ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
సన్నాలు అధికంగా సాగు చేసే నిజామాబాద్ (Nizamabad Paddy Centers)కు 480 కేంద్రాలను ప్రతిపాదించారు. ఇక్కడ ఎనిమిది లక్షల ధాన్యం దిగుబడి వస్తే, ఏడు లక్షలు సన్నాలే ఉంటాయని అధికారుల అంచనా. అయితే సన్నవడ్లకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రామాణికాలు విధించింది. ఆ కొలతల ప్రకారం ఉన్న సన్నాలకే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని స్పష్టం చేసింది. మరి ఆ ప్రామాణికాలు ఏంటంటే..?
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బోనస్ వర్తించే 33 రకాలను వ్యవసాయ శాఖ ఇప్పటికే విడుదల చేసింది. ఇవే కాకుండా నిబంధనల మేరకు ఉన్న మిగిలిన రకాలను కూడా సన్నాలుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది.
సన్నాల కొలతలు :
- గింజ పొడవు 6 మి.మీ. కంటే తక్కువ ఉండాలి.
- వెడల్పు 2 మి.మీ. కంటే ఎక్కువ ఉండకూడదు.
- వీటి పొడవు, వెడల్పు నిష్పత్తి 2.5 మి.మీ. కంటే ఎక్కువ ఉండాలి.






