ManaEnadu:నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ ఫోర్త్ సీజన్ ఓ రేంజ్లో ప్రారంభమయ్యేందుకు సిద్ధమైంది. ఏపీ సీఎం, స్వయానా బాలయ్యకు బావ నారా చంద్రబాబు నాయుడుతో ముచ్చటించిన ఎపిసోడ్ రిలీజ్ కాగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇదే క్రమంలో మెగా అభిమానులకూ కనువిందు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ షోలో పాల్గొననున్నాడట.
వచ్చే ఏడాది విడుదల కానున్నా..
రామ్ చరణ్ తన రాబోయే చిత్రం గేమ్ ఛేంజర్‌ను ప్రమోట్ చేసేందుకు ఈ అన్‌స్టాపబుల్‌లో పాల్గొననున్నాడట. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానున్నప్పటికీ చెర్రీ అన్‌స్టాపబుల్‌లో కనిపిస్తే మూవీకి మైలేజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. బాలయ్యతో షో అంటే ఆ మాత్రం ఉంటుంది మరి! ఇదిలా ఉంటే ఈ సినిమా రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కియారా అద్వానీ సందడి చేయనుంది. విలక్షణ దర్శకుడు శంకర్ ఈ మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
అదిరిపోయే పోస్టర్ రిలీజ్..
ఈరోజు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో చరణ్ కుర్చీలో కూర్చుంటే ఎదురుగా చాలా మంది రౌడీలు వస్తున్నట్టు ఉంది. దీంతో ఇది పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ నుంచి తీసుకున్న ఫొటో అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే పోస్టర్ రిలీజ్ చేసే క్రమంలో ఫైర్ క్రాకర్స్ సింబల్స్ మెన్షన్ చేశారు. దీంతో టీజర్ దీపావళి కానుకగా రిలీజ్ కానుందని ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టారు. దీంతో పాటు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10నే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. వీటికి తోడు తాజాగా వస్తున్న ‘అన్‌స్టాపబుల్’ వార్త మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది.






