Mana Enadu : వెలుగులు పంచే దీపావళి (Diwali) ఐదు రోజుల పండుగ అని తెలిసిందే. ఈ ఐదు రోజుల్లో అత్యంత ముఖ్యమైనది నరక చతుర్దశి. ఈ ఏడాది నరక చతుర్దశి తిథి ద్వయం వచ్చినందున ఏ రోజున జరుపుకోవాలన్న విషయంపై కాస్త గందరగోళం నెలకొంది. అయితే తెలుగు పంచాంగం ప్రకారం, నరక చతుర్దశి(naraka chaturdashi 2024) ఆశ్వయుజ బహుళ చతుర్దశి తిథి అక్టోబర్ 30న మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:52 గంటలకు ముగుస్తుందని పంచాంగకర్తలు చెబుతున్నారు.
నరక చతుర్దశి ఏ రోజు
సాధారణంగా పండుగలు సూర్యోదయం తిథి ఆధారంగా జరుపుకుంటారని.. నరక చతుర్దశిని అక్టోబర్ 31వ తేదీ గురువారం రోజే జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. నరక చతుర్దశి రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు, తర్వాత 11 గంటల నుంచి ఒంటి గంట వరకు పూజకు శుభసమయమని చెబుతున్నారు.
యమ దీపం అంటే ఏమిటి?
ఇక నరక చతుర్దశి రోజున పెట్టే దీపాన్ని యమ దీపం (Yama Deepam) అంటారు. ఈ దీపం వల్ల యమ లోకంలో ఉన్న పెద్దలకు నరకం నుంచి విముక్తి కలిగి స్వర్గానికి చేరుకుంటారనేది భక్తుల విశ్వాసం. పూర్వీకులకు నరకం నుంచి స్వర్గానికి వెళ్లే దారి చూపించడం కోసమే ఈ యమ దీపం పెట్టాలని పురాణాల్లో ఉన్నట్లు ప్రతీతి. నరక చతుర్దశి రోజు సాయంత్రం మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 వత్తులు వేసి ఆ ప్రమిదను ఒక రావి ఆకుపై దక్షిణ దిక్కుగా ఉంచి దీపాన్ని వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు.
యమ దీపం ఇలా వెలిగించాలి
నరకచతుర్దశి రోజు యమ ధర్మరాజుని పూజించి, యమ దీపం వెలిగిస్తే అపమృత్యు దోషాలు, అకాల మరణం లేకుండా ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలుగుతుందని పంచాంగకర్తలు చెబుతున్నారు. రానున్న నరక చతుర్దశి రోజు పెద్దలు గురువులు చెప్పిన విధంగా, శాస్త్రోక్తంగా జరుపుకుని.. ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి.