Mana Enadu : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), ఆయన సోదరి ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా వారి తల్లి వైఎస్ విజయమ్మ (YS Vijayamma) బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఈ వివాదంపై షర్మిల స్పందించారు. ఆ లేఖతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
అదో పెద్ద జోక్
“జగన్ బెయిల్ రద్దుకు మేము కుట్ర చేస్తున్నామని వైసీపీ అనడం ఈ శతాబ్ధపు అతి పెద్ద జోక్. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు. రూ.32 కోట్లు విలువ చేసే స్థిరాస్తి మాత్రమే. షేర్ల ట్రాన్స్ఫర్ (Shares Transfer) పై ఎలాంటి ఆంక్షలు లేవు. గతంలోనూ ఈడీ (Enforcement Directorate) ఎన్నో కంపెనీల ఆస్తులను అటాచ్ చేసింది. వాటికి స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్, బదిలీలు మాత్రం ఆపలేదన్న విషయం గుర్తించాలి. ఈడీ అటాచ్ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదనడం పెద్ద జోక్. నాకు 100 శాతం వాటాలు బదలాయిస్తామని ఎంవోయూపై జగన్ సంతకం చేశారు. బెయిల్ (Jagan Bail Issue) రద్దవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా?” అని షర్మిల ప్రశ్నించారు.
అప్పుడేమో అలా.. ఇప్పుడు డ్రామాలా?
2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్‌కి చెందిన సరస్వతి షేర్ల (Saraswati Shares)ను రూ. 42 కోట్లకు విజయమ్మకు ఎలా అమ్మారో చెప్పాలని డిమాండ్ చేసిన షర్మిల.. అప్పుడు స్టేటస్ కోను ఉల్లంఘించినట్లు కాదా అని ప్రశ్నించారు. షేర్ల బదిలీకి, బెయిల్ రద్దుకు సంబధం లేదని జగన్‌కు కూడా తెలుసని వ్యాఖ్యానించారు. అందుకే అప్పుడు సంతకాలు చేసి, ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ బెయిల్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని విజయమ్మకు తెలుసని షర్మిల పేర్కొన్నారు.






