Mana Enadu : దీపావళి బాక్సాఫీస్ రేసులో (Diwali release movies) ఈసారి యంగ్ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన సినిమా కూడా ఉంది. ఈ పండుగకు ఆయన నటించిన ‘క’ (KA Movie) సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి రిలీజ్ వరకు ప్రతి ప్రమోషన్ ఈవెంట్ లో చిత్రంపై మేకర్స్ హైప్ క్రియేట్ చేశారు. మరి ఇవాళ (అక్టోబర్ 31వ తేదీ) రిలీజ్ అయిన ‘క’ (KA Movie 2024) మూవీ ప్రేక్షకులను మెప్పించిందా..?
- మూవీ: క
- నటీనటులు: కిరణ్ అబ్బవరం; తన్వీ రామ్, నయన్ సారిక, అచ్యుత్‌కుమార్, రెడిన్ కింగ్‌స్లే
- సంగీతం: సామ్ సీఎస్
- ఎడిటింగ్: శ్రీ వరప్రసాద్
- సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్, సతీశ్‌రెడ్డి మాసం
- నిర్మాత: చింతా గోపాలకృష్ణ
- రచన, దర్శకత్వం: సుజీత్ – సందీప్
- విడుదల: 31-10-2024
రేటింగ్ : 3/5
ఇదీ క స్టోరీ : అనాథ అయిన అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో జీవిస్తుంటాడు. ఇతరుల ఉత్తరాలు చదువుతూ.. వాటిని తన సొంత వాళ్లే రాసినట్లు ఊహించుకుంటూ బతికేస్తుంటాడు. ఓసారి తన ఉత్తరం దొంగతనంగా చదివాడని మాస్టార్ గురునాథం (బలగం జయరాం) వాసును కొట్టడంతో ఆశ్రమం నుంచి పారిపోయిన వాసుదేవ్.. ఆ తర్వాత కొన్నాళ్లకు వ కృష్ణగిరికి వచ్చి అక్కడ కాంట్రాక్ట్ పోస్ట్‌మెన్‌గా ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊళ్లో ఉండే పోస్ట్‌మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయన సారిక)తో ప్రేమలో పడతాడు.
మరోవైపు ఆ ఊళ్లో అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుకు ఓ లెటర్ వల్ల ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించిన క్లూ ఒకటి దొరకడంతో వాసుదేవ్ లైఫ్ ప్రాబ్లెమ్స్ లో చిక్కుకుంటుంది. ఆ ఊరి అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి ఎవరు కారణం? వాసుతో పాటు టీచర్ రాధ (తన్వి రామ్)ను కిడ్నాప్ చేసి వేధించే ముసుగు వ్యక్తి ఎవరు? వాసుదేవ్ – సత్యభామల ప్రేమకథ ఏమైంది? తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.
మూవీ ఎలా ఉందంటే : క లాంటి కాన్సెప్టు ఇంత వరకు రాలేదన్న హీరో మాటలు మూవీ చూస్తే నిజమేననిపించకమానదు. ఈ మూవీ కోసం డైరెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్న స్టోరీ.. దాన్ని తెరకెక్కించిన విధానం.. కృష్ణగిరి ఊరి సమస్య.. దాన్ని పరిష్కరించే క్రమంలో హీరోకు ఎదురయ్యే ఛాలెంజెస్.. అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోతుంది. క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులకు బుర్ర తిరిగేలా చేస్తుంది. పుట్టుక.. కర్మ ఫలం.. రుణానుబంధం.. అనే అంశాల్ని ముడిపెట్టి దర్శకుడు చెప్పిన మెసేజ్.. స్టోరీని ఎండ్ చేసిన విధానం మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే : కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా అని కాలర్ ఎగరేసుకుని మరీ చెప్పుకోవచ్చు. అభినయ వాసుదేవ్‌గా ఆయన నేచురల్ గా నటించి ఆకట్టుకున్నారు. ఎమోషనల్ సీన్స్ తన ఎక్స్ ప్రెషన్స్ తో ఏడిపించేశారు. ఈ మూవీలో కిరణ్ లోని మరో యాంగిల్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది. నయన సారిక అందంగా కనిపించింది. మిగతా నటులు వారి పరిధి మేరకు నటించారు. క చిత్రం పూర్తిగా డైరెక్టర్లు సుజీత్- సందీప్‌ల (KA movie director) సినిమా. ఫస్టాఫ్, సెకండాఫ్ లో కొన్ని లోటుపాట్లు కనిపించినా.. వీళ్లు ఇచ్చిన ట్విస్టులకు ప్రేక్షకులకు అవి గుర్తు కూడా ఉండవు. క అనే పదానికి వెనకున్న అర్థం బాగుంది. సామ్ సిఎస్ తన పాటలతో ఆకట్టుకున్నారు.
పాజిటివ్ పాయింట్స్
- స్టోరీ, స్క్రీన్ ప్లే
- ఇంటర్వెల్, క్లైమాక్స్ లోని ట్విస్ట్‌లు
నెగిటివ్ పాయింట్స్
- ఊహకు తగ్గట్టు సాగే కొన్ని సీన్స్
చివరిగా: ఖతర్నాక్ ‘క’ తో కిర్రాక్ అనిపించిన కిరణ్ అబ్బవరం (KA Movie Review)






