Mana Enadu : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి (Yadadri) బదులు యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD News) తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు (Yadagirigutta Temple Board) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
టీటీడీ తరహాలో యాదాద్రి బోర్డు
యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. టెంపుల్ బోర్డు (Temple Board) ఏర్పాటు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విధివిధానాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. యాదగిరిగుట్ట బోర్డుకు టీటీడీ (TTD) స్థాయిలో ప్రాధాన్యత ఉండేలా అధ్యయనం చేసి టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని.. గో సంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
“కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు (Yadagirigutta Accommodation) వీలుగా చర్యలు తీసుకోవాలి. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలి. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలి. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేయాలి. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలి. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి, మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రతిపాదనలతో రావాలి.” అని అధికారులను ఆదేశించారు.






